
భారీ మనుగుమియ్యా చేప లభ్యం
కృష్ణానదిలో చేపల వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడికి భారీ మనుగుమియ్యా చేప లభ్యమైంది. ఎర్రవల్లి మండలంలోని షేకుపల్లికి చెందిన తెలుగు బుచ్చన్న సోమవారం గ్రామ శివారులోని కృష్ణానదిలో చేపల వేట కోసం వెళ్లి గాలాలు వేయగా 5 కిలోల బరువున్న మనుగుమియ్యా చేప చిక్కింది. సాధారణంగా ఈ చేపలు అర కిలో నుంచి కిలో లోపే బరువు ఉంటాయి. కానీ 5 కిలోల చేప లభ్యం కావడంతో గ్రామస్తులు కొనుగోలు చేసేందుకు పోటీ పడి రూ.2,500 కొన్నారు. ఈ చేప అచ్చం పాములా ఉండి.. అధిక పోషకాలు, రుచికరమైన మాంసం కలిగి ఉంటుందని పేర్కొన్నారు. – ఎర్రవల్లి
‘రాష్ట్ర సరిహద్దు పన్ను రద్దు చేయాలి’
జడ్చర్ల: తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలకు టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సులు వెళ్లే క్రమంలో వసూలు చేస్తున్న పన్నులను రద్దు చేయాలని టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు యజమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం జడ్చర్లలో ట్రావెల్స్ బస్సు యజమానుల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కర్ణాటక మినహాయించి కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు వెళ్లే ట్రావెల్స్ బస్సులకు ఎలాంటి పన్ను విధానం లేదన్నారు. ఇతర రాష్ట్రాలతో కుదిరిన అవగాహన ఒప్పందంతో పన్నులు ఉండేవి కావన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అనంతరం ఆయా విధానానికి స్వస్తి పలకడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లే సందర్భంగా సరిహద్దు పన్నులు చెల్లించాల్సి వస్తుందని వాపోయారు. అదేవిధంగా తమ బస్సులకు పట్టణాల్లో పార్కింగ్ చలాన్లు విధిస్తున్నారని వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇక గ్రీన్ ట్యాక్స్‌ను తగ్గించాలని కోరారు. తమ సమస్యల పరిష్కారానికి త్వరలోనే రాష్ట్ర స్థాయిలో టూరిస్ట్ బస్సు యజమానుల సంఘం ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. జడ్చర్లలో 60 మంది సభ్యత్వం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి హరీశ్, జిల్లా నాయకులు కమతం వెంకటేశ్వర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మహేశ్, సంతోష్, జగదీశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భారీ మనుగుమియ్యా చేప లభ్యం

భారీ మనుగుమియ్యా చేప లభ్యం