
తేజేశ్వర్ హత్యలో ట్విస్టుల మీద ట్విస్టులు
గద్వాల క్రైం: జోగుళాంబ గద్వాల జిల్లాకేంద్రానికి చెందిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ దారుణ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటపడుతున్నాయి. హత్యకు పాల్పడిన ప్రధాన నిందితులు తిరుమలరావు ఏ–1, కుమ్మరి నాగేష్ ఏ–3, చాకలి పరశురాముడు ఏ–4, చాకలి రాజు ఏ–5లను ఈ నెల 10న విచారణ అధికారి శ్రీను కోర్టు అనుమతితో నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని హత్యకు దారి తీసిన అంశాలను నిందితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ క్రమంలో మొదటి రోజు హత్య, రెండోరోజు బ్యాంకు తనిఖీలో వాయిస్ మెసేంజర్, మూడోరోజు గద్వాలలో మృతుడి బెడ్‌రూంలో స్పై కెమెరా ఉన్నట్లు నిందితులు వాంగ్మూలం ఇచ్చారు.
● మూడు రోజుల పోలీసుల కస్టడీలో నిందితులు చెప్పిన వాంగ్మూలం, సీన్ రీ కన్‌స్ట్రక్షన్‌లో హత్యకు గల కారణాలు వెల్లడించారు. అయితే తేజేశ్వర్ ఉంటున్న బెడ్‌రూంలో స్పై కెమెరా ఉన్నట్లు బహిర్గతం చేయడంతో పోలీసులు సైతం కంగుతిన్నారు. అనుకున్న ప్రకారం నెల వ్యవధిలో తేజేశ్వర్‌ను హత్య చేయాలనే లక్ష్యంతో పథకం వేసినట్లు చెప్పారు. హత్య చేసి కొన్ని రోజులు లడాఖ్ లేదా అండమాన్‌లో స్థిరపడాలనే ప్రణాళిక రచించినట్లు ధ్రువీకరించారు. ఈ కొత్త ట్విస్టు వెలుగులోకి రావడంతో ఐశ్వర్యను కస్టడీలోకి తీసుకునేందుకు పోలీసులు పీటీ వారెంట్‌ను కోర్టుకు సమర్పించారు. శనివారం రాత్రి కస్టడీలోకి తీసుకున్న నిందితులను విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. అయితే నేడో, రేపో ఏ–2 ఐశ్వర్వను కస్టడీలోకి పోలీసులు తీసుకునే అవకాశం ఉంది.
మరోసారి కస్టడీ తీసుకుంటాం..
తేజేశ్వర్ హత్యకు గల కారణాలు, తిరుమలరావు, ఐశ్వర్యలు సుపారీ గ్యాంగ్‌తో వేసిన పథకం తదితర అంశాలపై ఏ–1, 3, 4, 5లను కస్టడీలోకి తీసుకుని విచారించాం. అయితే స్పై కెమెరా విషయంపై స్పష్టత లేదు. దీనిపై ఏ–2 ఐశ్వర్యను కస్టడీలోకి తీసుకుంటే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయి. సాంకేతిక పరిజ్ఞానం, హత్యకు వేసిన ప్రణాళికలు నిందితుల వాంగ్మూలం, సీన్ రీ కన్‌స్ట్రక్షన్ పూర్తి చేశాం. త్వరలో అన్ని వివరాలు తెలియజేస్తాం. – శ్రీను, సీఐ, గద్వాల

తేజేశ్వర్ హత్యలో ట్విస్టుల మీద ట్విస్టులు