
కాల్వలు పడావు
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు
జడ్చర్ల: జడ్చర్ల నియోజకవర్గంలోని భూ సమస్యలపై ప్రత్యేక దృష్టిని సారించి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. సోమవారం ఆమె ఆర్డీఓ నవీన్‌తో కలిసి జడ్చర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. దాదాపు మూడు గంటల పాటు భూ రికార్డులను పరిశీలించారు. బూరెడ్డిపల్లి శివారులోని 102, 117 సర్వేనంబర్‌లలో గల అసైన్డ్ భూములకు సంబంధించి పాత రికార్డులను తెప్పించి విచారించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బూరెడ్డిపల్లి శివార్లలోని అసైన్డ్ భూములను విచారించడంతో పాటు రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సమస్యలపై ఆరా తీసినట్లు తెలిపారు. కాగా..జడ్చర్ల వేంకటేశ్వరస్వామి దేవస్థాన భూములను కొందరు అక్రమార్కులు వెంచర్లు చేసి విక్రయించారని, ఆయా వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్‌కు వివరించగా స్థానిక తహసీల్దార్ నర్సింగరావును వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా భూములకు సంబంధించి కోర్టులో స్టేటస్ కో ఆర్డర్ ఉన్నట్లు తహసీల్దార వివరించారు. అసైన్డ్, ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా ఉన్న రికార్డులను పరిశీలిస్తున్నామని, ఆక్రమణలు తేలితే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయం పక్కనే శిథిలావస్థకు చేరిన వ్యవసాయ భూసార పరీక్ష కార్యాలయంపై ఆరా తీశారు. అది పట్టా భూమిలో ఉండడంతో భవనాన్ని కూల్చలేక పోయామని తహసీల్దార్ వివరించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కిషోర్, తదితరులు పాల్గొన్నారు.
అర్జీలను పెండింగ్‌లో పెట్టొద్దు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర అఽధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. మొత్తం 142 అర్జీలను ప్రజల నుంచి స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. అనంతరం జరిగిన అధికారులతో మాట్లాడుతూ గ్రామపరిపాలన అధికారుల నియామకానికి ఆసక్తి ఉన్న వివిధ శాఖలలో పనిచేస్తున్న మాజీ వీఆర్‌ఓలు, వీఆర్‌ఏలు, వీఏఓలు వారు ఈ నెల 16 లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టి వందకు వంద శాతం లక్ష్యాలను సాధించే దిశగా పూర్తి చేయాలన్నారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను సమర్పించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మధుసూదన్‌నాయక్, ఆర్‌డీఓ నవీన్, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, డీఆర్‌డీఓ నర్సిములు పాల్గొన్నారు.