
బీసీలను మళ్లీ మోసం చేసిన కాంగ్రెస్
స్టేషన్ మహబూబ్‌నగర్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి బీసీలను మోసం చేయాలని చూస్తుందని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌సాగర్ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఎన్నికలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదని, అందుకే మొదటి నుంచి కులగణనలో కూడా శాసీ్త్రయతను పాటించకుండా ఎన్నికల నిర్వహణపై దాటవేత ధోరణిని అవలంభిస్తుందన్నారు. ప్రభుత్వానికి స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీ, మండలిలో బిల్లు ఆమోదం పొందగానే గవర్నర్‌తో ఆమోదింపజేసుకొని గెజిట్ తీసుకొచ్చి ఎన్నికలు నిర్వహించేదన్నారు. కానీ, ఏడాదిపాటు ఎన్నికలు నిర్వహించకుండా స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసి ఇప్పుడు ఆర్డినెన్స్ తెచ్చి కోర్టుల్లో వీగిపోయేలా చేసే కుట్రకు మరోసారి తెరలేపిందన్నారు. బీసీ సంక్షేమం, రాజకీయ, విద్య, ఉద్యోగ ప్రయోజనాలను పరిరక్షించాలంటే 9వ షెడ్యూల్ మాత్రమే శరణ్యమన్నారు. ఎన్నికల సమయంలో బీసీలను ఆకర్శించేందుకు తాత్కాలికంగా తీసుకొచ్చే ఈ విధమైన ఆర్డినెన్స్ కోర్టులో నిలబడవని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షాన్ని తీసుకెళ్లి పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం తెలిపిన తర్వాత 9వ షెడ్యూల్‌లో చేర్చేలా కృషి చేయాలన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని, లేని పక్షంలో గతంలో అధికారంలోకి రావడానికి బీసీలు ఏ విధంగా కృషి చేశారో ఇప్పుడు దూరం చేయడానికి అలాగే బీసీ సమాజం మొత్తం ముందుకు వెళ్తుందన్నారు. సమావేశంలో ఆయా సంఘాల ప్రతినిధులు లక్ష్మీకాంత్, కృష్ణ, బుగ్గన్న, మహేందర్, ఆశన్న, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.