
మెరిట్ కమ్ సీనియారిటీతో ఉద్యోగులకు అన్యాయం
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): మెరిట్ కమ్ సినియారిటీ విధానాన్ని విద్యుత్ సంస్థలో ప్రవేశపెట్టడంతో విద్యుత్ ఉద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దాసరి శ్యాంమనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక నేషనల్ ఫంక్షన్ హాల్‌లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల ఎత్తివేయాలని యాజమాన్యం చూస్తుందని, దాని అడ్డుకునేందుకు విద్యుత్ ఉద్యోగులు ఒక్క తాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు. రాష్ట్ర అసోసియేషన్ కార్యనిర్వహక అధ్యక్షుడు చంద్రయ్య మాట్లాడుతూ విద్యుత్ సంస్థల్లో మన అసోసియేషన్ పోరాటం ద్వారా కాంట్రాక్ట్ పద్ధతి రద్దయి వారిని ఆర్టిజన్ ఉద్యోగులుగా తీసుకున్నారన్నారు. కార్యక్రమంలో టీజీఎస్పీడీసీఎల్ అసోసియేషన్ కంపెనీ ప్రధాన కార్యదర్శి బీచుపల్లి, రిజినల్ కార్యదర్శి గంగాధర్, రాష్ట్ర అడిషనల్ ప్రధాన కార్యదర్శి సోమ్లానాయక్, అసోసియేషన్ కంపెనీ అధ్యక్షుడు ఆనంద్‌బాబు, కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్సింహ, ఉపాధ్యక్షుడు మహేష్ తదితరులు పాల్గొన్నారు.