జడ్చర్ల: తాము తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే చూపాలి తప్ప.. పదేపదే అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జడ్చర్లలో ఎన్‌హెచ్–167 విస్తరణకు సంబంధించి బీఆర్‌ఎస్‌కు చెందిన వారి ఇళ్ల వద్ద కొలతలను కుదించారని ఇటీవల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి చేసిన ఆరోపణలపై లక్ష్మారెడ్డి తీవ్రంగా స్పందించారు. గురువారం బీఆర్‌ఎస్ నాయకుడి ఇంటి నుంచి స్వయంగా టేపు పట్టి కొలతలు వేసి సరిగ్గానే ఉన్నట్లు నిర్ధారించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తమ పార్టీకి చెందిన ఇంటి వద్ద కొలతలు సరిగ్గానే ఉన్నాయని.. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన వారి ఇళ్ల వద్ద కొలతలు వేసి సరిచేయాలంటూ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు. అదే విధంగా వంద పడకల ఆస్పత్రి వద్ద తన సోదరి పేరున రెండెకరాల అసైన్డ్ భూమి ఉందంటూ తప్పుడు ఆరోపణలు చేయడం తగదన్నారు. రికార్డులు ఉంటే నిరూపించాలని డిమాండ్ చేశారు. తన మేనల్లుడి పేరిట ఉన్న 10 గుంటల భూమికి పక్కాగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. రంగారెడ్డిగూడలో సుమారు 80 ఎకరాల దేవాదాయశాఖ భూమిపై అనుమానాలు ఉన్నాయని.. దీనిపై శ్వేతపత్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తాను అసైన్డ్‌దారులకు డబ్బులు ఇచ్చి వంద పడకల ఆస్పత్రికి, రంగారెడ్డిగూడలో డబుల్‌బెడ్రూం ఇళ్ల నర్మాణానికి భూ సేకరణ చేపట్టామన్నారు. అంబేడ్కర్ చౌరస్తా నుంచి పాతబజార్ ప్రాంతానికి వాహనాలు వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బందులు లేవని మరోసారి స్పష్టం చేశారు. సమస్యను పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేనే గందరగోళంగా మాట్లాడటం శోచనీయమన్నారు. ఇక పోలేపల్లి సెజ్ నుంచి తన ఖాతాలోకి డబ్బులు వచ్చాయనే దాన్ని కూడా నిరూపించాలన్నారు. గంగాపూర్–బాలానగర్ రోడ్డు విస్తరణ పనులను తాము మంజూరు చేసినవేనని.. అలా కాదంటే కొత్త జీఓ చూపాలన్నారు. బాలానగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడిన కుటుంబాలకు ఒక్క రూపాయి పరిహారం ఇప్పించలేక పోయారన్నారు. రాష్ట్రస్థాయిలో ఆంధ్రా కోవర్టులపై మాట్లాడిన ఎమ్మెల్యే.. మొదటగా జడ్చర్లలో పనులు చేపట్టిన ఆంధ్రా కాంట్రాక్టర్ల బిల్లులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. తమపై లేనిపోని ఆరోపణలు చేయడం మానుకొని జడ్చర్ల అభివృద్ధిపై దృష్టిసారించాలని హితవు పలికారు. సమావేశంలో జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ యాదయ్య, కౌన్సిలర్లు ప్రశాంత్‌రెడ్డి, నంద,రఘు ఉన్నారు.
తాము తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే చూపాలి
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజం