
నాగర్‌కడ్మూర్‌లో ఉద్రిక్తత
అదృశ్యమైన వివాహిత మృతి.. కోయంబత్తూర్‌లో రైల్వే ట్రాక్‌పై మృతదేహం
భర్తే కొట్టి చంపారంటూ
తల్లిదండ్రుల ఆరోపణ
అమరచింత: వివాహిత మాధవి (26) మృతికి భర్త శివ కారణమంటూ బంధువులు భర్త ఇంటిపై దాడికి యత్నించిన ఘటన మండలంలోని నాగల్‌కడ్మూర్‌లో గురువారం చోటు చేసుకోగా ఉద్రిక్తతకు దారితీసింది. సీఐ శివకుమార్ ఇరువర్గాలను శాంతింపజేసి వివాదాన్ని సద్దుమణిగించారు. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కుర్వ శివకు గద్వాల జిల్లా కొండపల్లికి చెందిన మాధవితో మూడేళ్ల కిందట వివాహం జరగగా 11 నెలల కుమారుడు ఉన్నారు. భార్యాభర్తలిద్దరూ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేసేవారు. శివకు భార్యపై అనుమానం ఉండటంతో పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు కొనసాగాయి. అనుమానం అధికమై రెండు నెలల కిందట మాధవిని ఉద్యోగం మాన్పించాడు. ఆమె వద్ద ఉన్న సెల్‌నంబర్‌ను సైతం బ్లాక్ చేయడంతో ఇరువురు మధ్య గొడవలు అధికమయ్యాయి. ఆదివారం తొలి ఏకాదశి రోజున ఆలయానికి వెళ్దామని శివ భార్యకు చెప్పగా ఆమె నిరాకరించడంతో వదిలి వెళ్లారు. అదేరోజు మాధవి ఇంటి నుంచి కనిపించకుండా పోవడంతో హైదరాబాద్ పహడిషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మూడు రోజుల కిందట ఆమె మృతదేహం తమిళనాడులోని కోయంబత్తూర్ రైల్వే ట్రాక్‌పై పడి ఉండటం.. అక్కడి రైల్వే పోలీసులు ఆధార్‌కార్డులో ఉన్న తండ్రి సెల్‌నంబర్ ఆధారంగా సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన కుటుంబ సభ్యులతో పాటు భర్త శివ పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని గురువారం నాగల్‌కడ్మూర్‌కు తీసుకొచ్చారు.
పోలీసుల సమన్వయంతో అంత్యక్రియలు..
తమ కుమార్తెను చిత్రహింసలకు గురిచేసి కొట్టి చంపారని మాధవి తల్లిదండ్రులతో పాటు బంధువులు, గ్రామస్తులు శివ కుటుంబంపై దాడికి యత్నించగా సీఐ శివకుమార్ ఆధ్వర్యంలో మదనాపురం, ఆత్మకూర్ ఎస్‌ఐలు, సిబ్బంది గ్రామానికి చేరుకొని వారితో మాట్లాడారు. వివాహ సమయంలో ఇచ్చిన 22 తులాల బంగారం, రూ.5 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టడంతో తిరిగి ఇస్తామని నాగల్‌కడ్మూర్ గ్రామ పెద్దలు హామీ ఇవ్వడంతో శాంతించారు. అంతక్రియలు జరిగే వరకు పోలీసులు గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు.

నాగర్‌కడ్మూర్‌లో ఉద్రిక్తత