
నల్లమలలో తప్పిపోయిన.. తోకల మల్లయ్య మృతి
మన్ననూర్: నల్లమల అడవిలో 12 రోజుల క్రితం తప్పిపోయిన లోతట్టు ప్రాంతం అప్పాపూర్ గ్రామానికి చెందిన తోకల మల్లయ్య(64) మృతదేహం కనిపించిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బంధువుల కథనం ప్రకారం.. తోకల మల్లయ్య అటవీశాఖలో వాచర్ ఉద్యోగం చేసి గత మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందాడు. ఈ క్రమంలో స్వగ్రామం అప్పాపూర్‌లో కుటుంబ సభ్యులతో ఉంటున్నాడు. అయితే 12 రోజుల క్రితం రెండు కుక్కలను వెంటపెట్టుకుని అటవీ ఉత్పత్తుల సేకరణ కోసం అడవిలోకి వెళ్లాడు. కాగా.. అదేరోజు సాయంత్రం రెండు కుక్కలు ఇంటికి వచ్చినా మల్లయ్య మాత్రం రాలేదు. దీంతో మరుసటి రోజు కుటుంబ సభ్యులు, గ్రామ యువకులు అడవిలో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే గురువారం మల్లయ్య మృతదేహం లభించినట్లుగా లింగాల పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. మల్లయ్యకు ఇద్దరు భార్యలు, 9 మంది పిల్లలు ఉన్నారు. ఈయన మృతికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
కందనూలు: ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వృద్ధురాలు మృతి చెందిన సంఘటన బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. భూత్పూర్ మండలం ఖిల్లాఘనపూర్‌కు చెందిన వెంకటమ్మ (65) కొడుకు బిజినేపల్లి మండల కేంద్రంలో మేస్త్రి పని చేసుకుని జీవనం సాగిస్తుండగా, ఆమె కొడుకు వద్ద ఉంటోంది. ఆమె మూడు నెలల క్రితం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి చెంచుగూడకు వెళ్లి తన కూతురు వద్దే ఉంటోంది. ఈనెల 7న చెంచుగూడలో ఓ కల్లు దుకాణంలో కల్లు తాగింది. దీంతో ఆమెకు వాంతులు, విరేచనాలు కావడంతో నాగర్‌కర్నూల్ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఆమె బుధవారం అర్ధరాత్రి చికిత్స పొందుతూ మృతి చెందింది. కల్తీకల్లు తాగడం వల్ల మృతి చెందినట్లు ఆమె కుమారుడు నాగరాజు గురువారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నల్లమలలో తప్పిపోయిన.. తోకల మల్లయ్య మృతి