
చిరుత సంచారంపై అప్రమత్తం
ప్రజలకు సూచనలు..
ఒంటరిగా ఎక్కడికీ వెళ్లవద్దు. ముఖ్యంగా తెల్లవారుజామున, రాత్రి సమయంలో
తిరగవద్దు.
పిల్లలను ఒంటరిగా బయటకు పంపడం, ఆటలు ఆడుకోవడం చేయవద్దు
రైతులు పశువులను మేత కోసం, ప్రజలు ఎండు కట్టెల కోసం అడవిలోకి తీసుకెళ్లొద్దు.
అటవీ ప్రాంత శివారులో మద్యం తాగడాన్ని పూర్తిగా నివారించాలి.
అటవీ ప్రాంతంలో ఆహార అవశేషాలు,
పశువుల మృతదేహాలు పడవేయవద్దు
చిరుత ఎదురైతే భయపడకుండా, చేతులు పైకి ఎత్తి, నెమ్మదిగా వెనక్కి అడుగులు వేయాలి.
అడవిలోకి, పొలాల వద్దకు వెళ్లేటప్పుడు గుంపులుగా వెళ్లాలి.
అరణ్య సమీప ప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జన నివారించి.. మరుగుదొడ్లు వినియోగించండి.
ఏదైనా సమాచారం ఉంటే వెంటనే అటవీ శాఖ అధికారులకు తెలియజేయాలి.
మహబూబ్‌నగర్ న్యూటౌన్: మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని వీరన్నపేట గుర్రం గట్టు ప్రాంతంలో చిరుత సంచారం, ప్రజలకు రక్షణ వంటి అంశాలపై గురువారం కలెక్టర్ విజయేందిర కలెక్టరేట్‌లో ఎస్పీ డి.జానకితోపాటు పోలీసు, అటవీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. చిరుత సంచరిస్తున్న ఏరియాలో సీసీ కెమెరాలు, బోన్‌ల ఏర్పాటు చేసినా చిరుత ఆచూకీ దొరకకపోవడంతో అప్రమత్తంగా ఉండేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అటవీ, పోలీసు శాఖలు సమన్వయంతో ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. చిరుతను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గుర్రం గట్టు చుట్టూ కంచె ఏర్పాటు చేసి విడతల వారిగా 24 గంటల పర్యవేక్షణ చేయాలన్నారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు అటవీ, పోలీసు శాఖల ఆధ్వర్యంలో గురువారం సాయంత్రం వీరన్నపేట గుర్రంగట్టు చుట్టూ కలియదిరుగుతూ డ్రోన్ కెమెరాలతో సెర్చింగ్ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. చిరుత సంచారంపై ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు, అటవీ శాఖలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గుర్రంగట్టు పరిసరాల్లో చిరుత పులి సంచారంతో తమ భద్రత కోసం తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని ప్రజలకు సూచించారు. జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, క్షేత్రాధికారి కమాలుద్దీన్, లక్ష్మీకాంత్‌రావు, నాగజ్యోతి, డీఆర్‌డీఓలు, బీట్ అధికారులు గుర్రంగట్టు ఏరియాలో చిరుత సంచరిస్తున్న ప్రదేశాన్ని సందర్శించి డ్రోన్ కెమెరాతో పర్యవేక్షించారు.
కలెక్టర్ ఆదేశాలతో..
వీరన్నపేట గుర్రంగట్టు ఏరియాలోపర్యటించిన అధికారులు
రెండు బోన్‌లు, సీసీ కెమెరాల ఏర్పాటు
డ్రోన్ కెమెరాతో సెర్చింగ్.. చిరుతను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదలాలని కలెక్టర్ ఆదేశం