
కర్మాగారాల్లో బాలలను గుర్తించాలి : ఎస్పీ
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో ఇప్పటి వరకు ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా చాలామంది చిన్నారులను గుర్తించి.. సురక్షితంగా వసతి కల్పించామని, ఈ ఏడాది నిర్వహించే కార్యక్రమంలోనూ బాల కార్మికులను గుర్తించాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఆపరేషన్ ముస్కాన్–11పై గురువారం ఎస్పీ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆపరేషన్ ముస్కాన్ ద్వారా పిల్లల రక్షణ, అదృశ్యమైన చిన్నారులు, బాల కార్మికులు, రోడ్లపై నివసించే వారిపై దృష్టిపెడుతున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఇతర అధికారులను సమన్వయం చేసుకుని బాల కార్మికులను రక్షిస్తూ, పనిలో పెట్టుకున్న వారిపై చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర మాట్లాడుతూ పిల్లల హక్కుల పరిరక్షణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తూ చిన్నారులను పనిలోకి వెళ్లకుండా పాఠశాలకు వెళ్లేలా చైతన్యం చేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, డెమో మంజుల, సీడబ్ల్యూసీ చైర్మన్ నయీముద్దీన్, ఉమెన్ పీఎస్ సీఐ శ్రీనివాసులు, ముస్కాన్ టీం ఎస్‌ఐ కుర్మయ్య, మహిళా ఎస్‌ఐ సుజాత తదితరులు పాల్గొన్నారు. అనంతరం షీటీం, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం, పోలీస్ సురక్ష కళా బృందం సభ్యులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. మహిళల రక్షణలో షీటీం బృందం కీలక పాత్ర పోషించాలని, రద్దీ ఏరియాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదవాలి
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విద్యార్థులు తమ భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ఉన్నత లక్ష్యాలతో చదవాలని పీయూ వీసీ శ్రీనివాస్ అన్నా రు. గురువారం జిల్లాకేంద్రంలోని ఆదర్శ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతి థిగా హాజరై మాట్లాడారు. చదువును నిర్లక్ష్యం చేయకుండా ఏకాగ్రతతో చదివితే మంచి ఫలితాలు వస్తాయన్నారు. అనంతరం రిజిస్ట్రార్ రమేష్‌బాబు మాట్లాడుతూ విద్యార్థులు కళాశాలలో అన్ని వనరులను వినియోగించుకుని బా గా చదవాలన్నారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ రాములు, కోశాధికారి అరుణ్‌కుమార్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది మనోహర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, రాక్సీజాయిస్, టాస్క్ మేనేజర్ సిరాజ్ పాల్గొన్నారు.
లైసెన్స్‌డ్ సర్వేయర్లకు శిక్షణ
మహబూబ్‌నగర్ న్యూటౌన్: జిల్లాలో గత మే నెలలో స్వీకరించిన దరఖాస్తుల ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా నియమించేందుకు అవసరమైన శిక్షణను జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నారు. జిల్లాలో 230 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా మొదటి విడతగా 132 మంది అభ్యర్థులకు రిటైర్డ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే అధికారి పర్వతాలు ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో భూ సర్వేపై శిక్షణ ఇస్తున్నారు. మే 26న ప్రారంభమైన మొదటి విడత శిక్షణ ఈ నెల 26 వరకు కొనసాగనుంది. ఇందులో అర్హత సాధించిన వారికి లైసెన్స్‌డ్ సర్వేయర్లుగా గుర్తించి సర్టిఫికెట్ జారీ చేస్తారు. భూభారతి ఆర్‌ఓఆర్–2025 చట్టం అమలులో వీరి సేవలు వినియోగించుకోనున్నారు.