
కాంగ్రెస్‌కు కంచుకోట పాలమూరు
స్టేషన్ మహబూబ్‌నగర్: ఉమ్మడి పాలమూరు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని, పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారని ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్, పీఏసీ సభ్యుడు జె.కుసుమకుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం పాటిస్తూ పదవుల నియామకం చేపడుతామన్నారు. ఈ నెల 15లోగా జిల్లా కాంగ్రెస్ కమిటీల కూర్పు చేస్తామన్నారు. ఒక్కో అసెంబ్లీ నుంచి ఒక ఉపాధ్యక్ష, రెండు ప్రధాన కార్యదర్శులు, మండలం నుంచి ఒక కార్యదర్శిని జిల్లావ్యాప్తంగా అందరి అభిప్రాయంతో నియామకం చేస్తామన్నారు. సీనియార్టీ, స్థానిక ఎమ్మెల్యేలు, నాయకుల ఏకాభిప్రాయంతో పదవులను కేటాయిస్తామని వెల్లడించారు. మేనిఫెస్టో ప్రమాణపత్రం లాంటిదని, మా మేనిఫెస్టోలో చెప్పిన పథకాలే కాకుండా చెప్పనివి కూడా అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన సాగుతుందన్నారు. పాలమూరు ముద్దుబిడ్డ సీఎం రేవంత్‌రెడ్డి సమర్థవంతమైన పాలన చేస్తున్నారని కొనియాడారు. 50 శాతానికి తగ్గకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండేలా ఈ కూర్పు ఉండాలని నిర్ణయించామని చెప్పారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ, ప్రభుత్వ పదవుల్లో అన్నివర్గాలకు అవకాశాలు కల్పించేలా సమావేశాలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకుంటామని వెల్లడించారు. రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి వస్తామని, వందసీట్లు గెలవాలనే లక్ష్యంతో పార్టీని బలోపేతం చేస్తామన్నారు. సమావేశంలో నారాయణపేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షులు వేణుగౌడ్, ప్రధాన కార్యదర్శలు సంజీవ్ మదిరాజ్, మిథున్‌రెడ్డి, నాయకులు వినోద్‌కుమార్, ఎన్‌పీ వెంకటేశ్, సురేందర్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, సిరాజ్‌ఖాద్రీ, సీజే బెనహర్, జహీర్ అఖ్తర్, వసంత, అజ్మత్‌అలీ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు కుసుమకుమార్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయాలని కోరారు.
ఈ నెల 15లోగా జిల్లా కాంగ్రెస్ కమిటీల కూర్పు
ఉమ్మడి జిల్లా ఇన్‌చార్జ్ జె.కుసుమకుమార్