
ఇంటర్ విద్యార్థిపై కత్తితో దాడి
గద్వాల క్రైం: ఇంటర్ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసిన ఘటన బుధవారం పట్టణంలో కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల పట్టణంలోని గంజిపేట కాలనీకి చెందిన రవితేజ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో అంబేడ్కర్ కాలనీకి చెందిన గుర్తు తెలియని యువకులతో కొన్ని రోజులు క్రితం రవితేజకు వివాదం జరిగింది. అయితే పాత కక్షలు మనసులో పెట్టుకొని కొందరు యువకులు బుధవారం పట్టణంలోని కోట సమీపంలో విద్యార్థితో ఘర్షణ పడి ఎడమ వైపు చాతీలో కత్తితో పొడిచారు. పక్కనే ఉన్న చరణ్‌తేజ గొడవను అడ్డుకునేందుకు ప్రయత్నం చేయగా అతడికి సైతం స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రవితేజ పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూల్ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఘటనపై పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. ఓ యువతితో ప్రేమ వ్యవహరమే దాడికి గల కారణాలు అయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.