
స్థానిక ఎన్నికలు అప్పుడే నిర్వహించాలి
జడ్చర్ల టౌన్: బీసీ రిజర్వేషన్ ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే జీఓకు చట్టబద్ధత ఉంటుందా? అని బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయాదవ్ ప్రశ్నించారు. మంగళవారం పట్టణంలో మండల విద్యావనరుల కేంద్రం వద్ద నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లను పెంచడానికి ప్రస్తుతం ఉన్న జీఓను సవరణ చేసి నూతన జీఓ అమలుకు న్యాయ నిపుణులు సలహ ఇచ్చారని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈనెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో జీఓ అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. 50శాతం సీలింగ్ విధానానికి అతీతంగా రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యాకే ఎన్నికలు నిర్వహించాలని, అలా జరగకుంటే తాము రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ జాగృతిసేన కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు సురభి విజయ్‌కుమార్, నియోజకవర్గ అధ్యక్షుడు నిరంజన్, మండల అధ్యక్షుడు నర్సింములు, ఎమ్మార్పీఎస్ నాయకుడు భీంరాజ్‌తోపాటు నాయకులు పాల్గొన్నారు.