మక్తల్: పేదల సంక్షేమమే ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని రాష్ట పశుసంవర్ధక, మత్స్య, క్రీడల యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. పట్టణంలో చేపడుతున్న 150 పడుకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లోపాలు లేకుండా వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడతల వారీగా ఇచ్చిన ప్రతి హామీని నేరవేస్తుందన్నారు. ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చానని, మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
రూ.153 కోట్లతో..
నియోజకవర్గ కేంద్రంలో రూ.153 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, అధికారులు గ్రామాల్లో నిరంతరం పర్యటించి లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని కోరారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు రూ.833.50 కోట్లు కేటాయించామని, అందుకు సంబంధించిన పనులు ఏడాదిలోగా పూర్తి చేస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు రూ.15.13 కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి, కట్ట సురేష్, కోళ్ల వెంకటేష్, రవికుమార్, బోయ నర్సింహ, రాజేందర్, అంజనే యులు, గద్వాల్ రవి, నాగరాజు, గోవర్ధన్, నీలప్ప, దండు రాము, శ్రీనివాసులు పాల్గొన్నారు.
మంత్రి వాకిటి శ్రీహరి