
జూరాలకు స్వల్పంగా పెరిగిన ఇన్‌ఫ్లో
ధరూరు: జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం ప్రాజెక్టుకు లక్షా 12వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మంగళవారం సాయంత్రానికి లక్షా 25వేలకు పెరిగింది. దీంతో ప్రాజెక్టు 14 క్రస్టు గేట్లను ఎత్తి 94,962 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పత్తి నిమిత్తం 29,053 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్టు–1కు 1300, ఆవిరి రూపంలో 43, ఎడమ కాల్వకు 770, కుడి కాల్వకు 400, ఆర్‌డీఎస్ లింక్ కెనాల్‌కు 150.. ప్రాజెక్టు నుంచి మొత్తం 1.26 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 7.952 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఆల్మట్టి, నారాయణపూర్‌కు వరద జోరు..
అలాగే, ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు వరద జోరు కొనసాగుతోంది. ఆల్మట్టి ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 129.72 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 91.08 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1,08,286 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న నారాయణపూర్ ప్రాజెక్టుకు 1,15,670 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక నారాయణపూర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 37.64 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 31.05 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 1,14,972 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 30 క్రస్టు గేట్లను ఎత్తి ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న జూరాలకు ప్రాజెక్టుకు 1,17,245 క్యూసెక్కుల నీటిని దగువకు విడుదల చేస్తున్నారు.
నిరంతరాయంగా విద్యుదుత్పత్తి
దిగువ, ఎగువ జూరాల జలవిద్యుదుత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 11 యూనిట్ల ద్వార విద్యుదుత్పత్తిని చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వార 195 మెగావాట్లు, 99.302 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వార 240 మెగావాట్లు, 119.011 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని చేపడుతున్నారు. ఇప్పటివరకు 30 వేల క్యూసెక్కులను వినియోగించి 218.313 ఎంయూ విజయవంతంగా విద్యుదుత్పత్తిని చేపట్టామని తెలిపారు.
14 క్రస్టు గేట్ల ఎత్తివేత..
11 యూనిట్ల ద్వారా కొనసాగుతున్న విద్యుదుత్పత్తి