
ప్రజాస్వామ్య మనుగడకు జర్నలిజం కీలకం
కందనూలు: ప్రజాస్వామ్య మనుగడకు జర్నలిజం కీలకమని రాష్ట్ర ఎకై ్సజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా నాలుగో మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మహోన్నతమైనదని అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జర్నలిజం నిర్భయంగా, నిర్మోహమాటంగా వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని.. ఎవరికీ కొమ్ము కాయరాదన్నారు. జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అర్హులందరికీ అక్రిడిటేషన్లు, హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కత్తికంటే కలం గొప్పదన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చాక జర్నలిస్టుల విలువ తెలిసిందన్నారు. తాము చేపట్టే అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తున్నది జర్నలిస్టులు మాత్రమేనని అన్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ మాట్లాడుతూ.. దేశంలో అగ్రభాగాన తమ సంఘం ఉందన్నారు. 20ఏళ్లకు పైగా సీనియార్టీ ఉన్న వారు ఉన్నారని చెప్పారు. ప్రజలకు వ్యతిరేకంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించమన్నారు. జర్నలిస్టులను పట్టించుకునే ప్రభుత్వాలకు సహకరిస్తామని.. పట్టించుకోని ప్రభుత్వాలపై పోరాడతామన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్, జిల్లా నూతన అధ్యక్షుడు విజయగౌడ్, కార్యదర్శి సురేశ్ తదితరులు ఉన్నారు.