
రూ.8 కోట్ల విలువైన ధాన్యం మాయం
కోస్గి: పట్టణంలోని రైస్ మిల్లుల్లో మంగళవారం పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారుల బృందం విస్తృత తనిఖీలు నిర్వహించింది. స్థానిక శ్రీలక్ష్మీ నర్సింహ రైస్ మిల్లులో భారీ మొత్తంలో వరి ధాన్యం నిల్వలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. డీఎస్‌ఓ బాల్‌రాజ్ తెలిపిన మేరకు వివరాలిలా.. రైస్ మిల్లు యజమానులు వరి ధాన్యం నిల్వలకు సంబంధించిన పూర్తి వివరాలు పౌర సరఫరాల శాఖకు అందించాలని పలుమార్లు సూచించినప్పటికీ కొందరు మిల్లర్లు స్పందించకపోవడంతో ఆకస్మిక దాడులు చేశారు. ఈక్రమంలో శ్రీలక్ష్మీ నర్సింమ రైస్ మిల్లులో రూ.8 కోట్ల విలువైన ధాన్యం నిల్వలు తేడా ఉన్నట్లు గుర్తించారు. అధికారిక లెక్కల ప్రకారం ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన వరి ధాన్యం బస్తాలను జిల్లాలోని రైస్ మిల్లులకు కేటాయించారు. సదరు శ్రీలక్ష్మీ నర్సింహ రైస్ మిల్లుకు సైతం 2022–23 రబీ సీజన్‌లో 56,625 బస్తాల ధాన్యం, 2024–25 ఖరీఫ్ సీజన్‌లో 22,792 బస్తాల ధాన్యం కేటాయించారు. ధాన్యం తీసుకొని నిర్ణీత గడువులోగా మర ఆడించి (సీఎమ్మార్) బియ్యాన్ని అందించాల్సి ఉండగా.. సదరు మిల్లర్ ఎంతకూ అందివ్వకపోవడంతో అధికారులు తనిఖీ చేశారు. అధికారికంగా 75,417 బస్తాల ధాన్యం ఉండాల్సి ఉండగా కేవలం 86 బస్తాల ధాన్యం మాత్రమే మిల్లులో నిల్వ ఉన్నట్లు గుర్తించారు. మిగిలిన 75,331 బస్తాల వరి ధాన్యం మాయమైందని, మొత్తం 3013.24 మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ.8 కోట్లు ఉంటుందని, సంబంధిత రైస్ మిల్లు యజమానిపై కేసు నమోదు చేసినట్లు జిల్లా సివిల్ సప్‌లై అధికారి బాల్‌రాజ్ తెలిపారు. తనిఖీల్లో ఆయనతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలు ఆనంద్, భాస్కర్, తహసీల్దార్ శ్రీనివాసులు, ఎస్‌ఐ బాల్‌రాజ్, ఆర్‌ఐలు, ఇతర రెవిన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
రైస్‌మిల్లులో అధికారుల తనిఖీతో వెలుగు చూసిన ఘటన
యజమానిపై కేసు నమోదు