
బాధితులకు సత్వర న్యాయం చేయాలి
మహబూబ్‌నగర్ క్రైం: ప్రజల సమస్యలకు చట్టపరమైన పరిష్కారాలు కల్పించేందుకు పోలీసులు పని చేయాలని ఎస్పీ డి.జానకి అన్నారు. ఎస్పీ కార్యాలయంలో సోమవారం వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. మొత్తం 12 మంది బాధితులు ఎస్పీకి ఫిర్యాదులు అందించగా పరిశీలించి ఆయా అధికారులతో ఫోన్‌లో మాట్లాడుతూ బాధితుల సమస్యలు సకాలంలో పరిష్కరించి.. సత్వర న్యాయం చేకూర్చాలని ఆదేశించారు. పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని, ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలన్నారు. ఫిర్యాదులు ఇచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలించి బాధితులకు తక్షణ న్యాయం చేయాలన్నారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన ఫిర్యాదులను నిత్యం పర్యవేక్షించాలన్నారు.