
వన మహోత్సవానికి సన్నద్ధం కావాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధం కావాలని అదనపు కలెక్టర్ శివేంద్రప్రతాప్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్‌తో ప్రజల నుంచి 104 ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటేందుకు సంబంధిత అధికారులు నిర్ణయించిన లక్ష్యం మేరకు ఈ నెల 10లోగా వందశాతం గుంతలు తీసి సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో వివిధ అంశాలపై సూచనలు చేశారు. ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో మండల ప్రత్యేకాధికారులు తనిఖీలు నిర్వహించి వివరాలను నిర్దేశించిన యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. శాఖల వారీగా పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులకు సంబంధించిన వివరాలను సమర్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్‌నాయక్ అధికారులను ఆదేశించారు.