
దొంగస్వామిని తరిమిన గ్రామస్తులు
కల్వకుర్తి రూరల్: గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని డబ్బులు దండుకోవాలని ప్రయత్నించిన దొంగస్వామిని గ్రామస్తులు తరిమిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ముకురాలలో చోటుచేసుకుంది. వివరాలిలా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దేశగురువుగా పేరు చెప్పుకొంటూ శనివారం రాత్రి ముకురాల గ్రామానికి ఆరుగురు శిష్యులతో కలిసి గుర్రంపై వచ్చి శివాలయంలో బస చేశాడు. ఆదివారం తొలి ఏకాదశి కావడంతో పూజల అనంతరం గ్రామంలో గుర్రంపై తిరుగుతూ ప్రజలకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఆయన గుర్రం వెంట ఆరుగురు బటులుగా ఉన్నారు. గుర్రంపై దొంగస్వామి ఓ ఇంటికి రాగానే ఆ ఇంటి మహిళ ఒక బిందెలో పసుపు, కుంకుమ కలిపిన నీటితో గుర్రం ముందు సాఖపెట్టి మొక్కింది. దీంతో వెంటనే దొంగస్వామి ఆశీర్వదించి.. ‘నీకు దోషముంది.. కొన్ని శక్తులు నిన్ను పీడిస్తున్నాయి.. నేను వాటిని తొలగిస్తాను’ అంటూ నమ్మబలికి ఇంట్లోకి ప్రవేశించాడు. వాళ్లను రకరకాల మాటలతో మోసం చేసి జేబులకు చిల్లుపెట్టే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన గ్రామస్తులు దొంగస్వామితో ఇల్లు ఒల్లు గుళ్లయ్యే ప్రమాదం ఉందని గ్రహించి అతనితో వాగ్వాదానికి దిగారు. మోసం చేస్తున్నావని నిలదీసి వెంటనే గ్రామం విడిచి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. చాలామంది గ్రామస్తులు రావడంతో వివాదం ముదిరింది. చివరికి గ్రామస్తులు గట్టిగా నిలదీసి వెంటపడి తరమడంతో దొంగస్వామి పలాయనం చిత్తగించక తప్పలేదు.