
బుద్దారంవాసికి అమెరికాలో గోల్డ్‌మెడల్
గోపాల్‌పేట: మండలంలోని బుద్దారం గ్రామానికి చెందిన హెడ్‌కానిస్టేబుల్ కృష్ణారావు అమెరికాలో గోల్డ్‌మెడల్ సాధించి అబ్బురపరిచాడు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన పసుపుల కృష్ణారావు హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అమెరికా అలబామాలో నిర్వహిస్తున్న వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్‌లో ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ స్పోర్ట్స్ విభాగం తరఫున ఇండోర్ రోయింగ్ గేమ్ 50 ప్లస్ విభాగంలో ప్రతిభ కనబర్చి గోల్డ్ మెడల్ సాధించాడు. ఈ గేంలో 80 దేశాల నుంచి 8500మంది పాల్గొనగా.. పసుపుల కృష్ణారావు గోల్డ్‌మెడల్ సాధించాడు. కృష్ణారావు గోల్డ్‌మెడల్ సాధించాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు, స్నేహితులు అతడికి ఫోన్‌కాల్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. దేశం, రాష్ట్రానికి, సొంతూరుకు మంచిపేరు తీసుకురావాలని కోరారు.