
స్పోర్ట్స్ అకాడమీలతో క్రీడాకారులకు వరం
● రాష్ట్రంలోని 8 అకాడమీల్లో ప్రవేశాలకు ఎంపికలు
● జూన్ 1 నుంచి 13 వరకు ఎంపికల కోసం పోటీలు
మహబూబ్‌నగర్ క్రీడలు: స్పోర్ట్స్ అకాడమీలు ఔత్సాహిక క్రీడాకారులకు వరంలా మారుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిల్లో రాణిస్తున్న క్రీడాకారుల్లో చాలా మంది స్పోర్ట్స్ అకాడమీల నుంచే వచ్చిన వారు. దీంతో ప్రతి ఏడాది రాష్ట్రంలోని స్పోర్ట్స్ అకాడమీలు, వసతి గృహాల్లో ప్రవేశాలకు బాల, బాలికల ఎంపికలు నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వివిధ క్రీడా అకాడమీలు, వసతి గృహాల్లో 2025–26 సంవత్సర ప్రవేశానికిగాను అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్, సైక్లింగ్, రెజ్లింగ్, హాకీ, హ్యాండ్‌బాల్, వాలీబాల్ క్రీడాంశాలకు సంబంధించి ప్రవేశాల్లో బాలబాలికలకు వచ్చేనెల 1 నుంచి 13 వరకు నిర్ణయించిన తేదీల్లో ఎంపికలు నిర్వహించనున్నారు. ఆసక్తి గలవారు కళాశాల లేదా పాఠశాల ప్రస్తుత విద్యా సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, క్రీడా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, 10 పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలతో ఎంపికలకు హాజరుకావాలి.
అకాడమీ, ఎంపికల షెడ్యూల్ ఇలా..
● జూన్ 1వ తేదీన సిద్దిపేట వాలీబాల్ అకాడమీ ఎంపికలు అదే అకాడమీలో జరగనున్నాయి.
● జూన్ 10, 11 తేదీల్లో హైదరాబాద్‌లోని ఓయూ క్యాంపస్ సైక్లింగ్, రెజ్లింగ్ అకాడమీ ఎంపికలు ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంగణంలో..
● జూన్ 10, 11 తేదీల్లో హన్మకొండలోని ప్రాంతీయ క్రీడా వసతి గృహం (అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్, హ్యాండ్‌బాల్) ఎంపికలు డీఎస్‌ఏ హన్మకొండలో..
● జూన్ 10వ తేదీన హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలోని వాలీబాల్ అకాడమీ, రాజన్న సిరిసిల్లిలోని వాలీబాల్ అకాడమీ ఎంపికలు వచ్చేనెల 10న రాజన్న సిరిసిల్లలోని మినీ స్టేడియంలో..
● జూన్ 12వ తేదీన హాకీ అకాడమీ (వనపర్తి) ఎంపికలు వనపర్తి లోని డాక్టర్ బాలకిష్టయ్య మినీ స్టేడియంలో..
● జూన్ 12న అథ్లెటిక్స్ అకాడమీ (ఖమ్మం)
ఎంపికలు..
● జూన్ 12, 13 తేదీల్లో వాలీబాల్ అకాడమీ (మహబూబ్‌నగర్) ఎంపికలు మహబూబ్‌నగర్‌లోని మెయిన్ స్టేడియంలో..
అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్రంలోని క్రీడా అకాడమీలు, వసతి గృహాల్లో ప్రవేశాల ఎంపికలను జిల్లాలోని అర్హులైన, ఆసక్తిగల బాలబాలికలు సద్వినియోగం చేసుకోవాలని ఎఫ్‌ఏసీ డీవైఎస్‌ఓ మధుసూదన్‌గౌడ్ తెలిపారు. సంబంధిత ఽధ్రువీకరణ పత్రాలతో ఎంపిక స్థలాల్లో ఆయా తేదీల్లో ఉదయం 7 గంటలకు హాజరుకావాలని ఆయన సూచించారు.