జడ్చర్ల: మండలంలోని గంగాపూర్‌లో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ నెల 24న ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో నందిని(18) తలకు వేసుకునే రంగు నూనెను తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. ఆలస్యంగా గమనించిన తల్లిదండ్రులు ఆమెను చికిత్స కోసం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి అటు నుంచి మెరుగైన వైద్య కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందగా మంగళవారం జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఘటనపై నందిని తండ్రి జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా యువతి ఆత్మహత్యకు కడుపు నొప్పి కారణమని కుటుంబ సభ్యులు చెప్పారు.
యువకుడు బలవన్మరణం
జడ్చర్ల: పట్టణంలోని కావేరమ్మపేటలో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బోయ మల్లేష్(26) కొన్ని రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలో ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం తండ్రి వెంకటయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కమలాకర్ తెలిపారు.
టీవీ చూసేందుకు వెళ్లిన చిన్నారిపై లైంగిక దాడి
జడ్చర్ల: అభంశుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని కావేరమ్మపేటలో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా.. కావేరమ్మపేటలోని ఓ కాలనీలో సోమవారం చిన్నారి(4) తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్లడంతో తమ ఇంటి సమీపంలో ఉన్న ఓ ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్లింది. అయితే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ బాలుడు(16) చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అనంతరం చిన్నారి ఇంటికి వెళ్లిన తర్వాత తల్లి గమనించి ఆరా తీయగా విషయం బయటకు వచ్చింది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ కమలాకర్, ఎస్‌ఐ మల్లేష్ చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లైంగిక దాడికి పాల్పడిన బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
ఇద్దరి పిల్లలతో సహాతల్లి అదృశ్యం
నవాబుపేట: భర్తతో గొడవ పడి ఇద్దరి పిల్లలతో కలిసి తల్లి అదృశ్యమైన ఘటన మండల పరిధిలో కామారం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బంటు చెన్నయ్య కూతురు బంటు స్వప్న (26)ను ఆరేళ్ల క్రితం బోయపల్లికి చెందిన దర్పల్లి కొండయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. కాగా ఇటీవల భార్యాభర్తల మధ్య గొడవలు జరగటంతో ఈనెల 18న స్వప్న కుమారుడు శివకుమార్ (5), కూతురు హర్షిత(4)తో కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. భర్త ఆమె ఆచూకీ కోసం వెతకగా 22న హైదరాబాద్‌లో ఉన్నట్లు తెలుసుకొని ఇంటికి తీసుకొచ్చారు. అయితే ఆమె పుట్టింటికి వెళ్తానంటూ వెళ్లి మరోసారి అదృశ్యమైంది. దీంతో మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ విక్రమ్ తెలిపారు.