
అందుబాటులో పచ్చిరొట్ట విత్తనాలు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): వానాకాలం సీజన్ సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పచ్చిరొట్ట విత్తనాలను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ జిల్లాకు విత్తనాల పంపిణీ ప్రారంభమైంది. అక్కడకక్కడా కురుస్తున్న వర్షాలతో రైతులు దుక్కులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భూసారం పెంపునకు పంటల సాగుకు ముందు పచ్చిరొట్ట విత్తనాలు చల్లి ఆపై కలియదున్నడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే వ్యవసాయశాఖ జీలుగు, పిల్లి పెసర, జనుము తదితర పచ్చిరొట్ట పైర్ల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తోంది. జిల్లా వ్యవసాయశాఖ జీలుగ 4,000 క్వింటాళ్లు, జనుము 1,000 క్వింటాళ్లు కావాలని ఇండెంట్ ఇవ్వగా.. ఇప్పటివరకు జీలుగ 2,000 క్వింటాళ్లు, జనులు 1,000 క్వింటాళ్ల విత్తనాలు తెప్పించారు. జిల్లాలోని పీఏసీఎస్‌లు, ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, టీజీఎస్‌డీఎల్ ద్వారా విత్తనాలను విక్రయానికి ఏర్పాట్లు చేశారు.
● సహజసిద్ధమైన ఎరువు లభించేలా పచ్చిరొట్ట పంటల సాగును ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం విత్తనాలపై 50 శాతం సబ్సిడీపై రైతులకు అందిస్తోంది. కిలో రూ.142.75 ధర ఉన్న జీలుగ విత్తనాలను రూ.71.25కు, రూ.125.50 ధర ఉన్న జనుము విత్తనాలను రూ.62.75కు, రూ.205.5 ధర ఉన్న పిల్లి పెసర విత్తనాలను రూ.102.50కు విక్రయిస్తారు.
పంపిణీకి విత్తనాలు సిద్ధం
ఇప్పటికే జిల్లాకు చేరుకున్న జీలుగ, జనుము విత్తనాలను నిర్దేశిత కేంద్రాలకు పంపించాం. 50 శాతం సబ్సిడీపై విక్రయించేలా పర్యవేక్షించనున్నాం. రైతులు తమ యొక్క పట్టాదారు పాసు పుస్తకంతో సంబంధిత ఏఈఓ, ఏఓలను సంప్రదించాలి. – బి.వెంకటేష్,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి
జిల్లాలో 3వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం
50 శాతం సబ్సిడీతో విక్రయం