
ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్
జెడ్పీసెంటర్(హహబూబ్‌నగర్): ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ విజయేందిర అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం సమీకృత జిల్లాకార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ వారం 103 అర్జీలు అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అనంతరం జిల్లా అధికారుల సమన్వయ సమావేశంలో మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం పథకం త్వరితగతిన పూర్తి చేసి జూన్ 2వ తేదీన అర్హులకు మంజూరు చేయాలని సూచించారు. ఎస్సీ అభివృద్ధి శాఖ, బీసీ అభివృద్ధి శాఖలకు ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. మండల స్పెషల్ అధికారులు ఎంపీడీఓలతో కలిసి దరఖాస్తులను ఫైనలైజ్ చేసి, ప్రతిపాదనలు పంపాలన్నారు. మొదటి దశలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల మార్క్ ఔట్ చేసి గ్రౌండింగ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్‌రావు, జెడ్పీ సీఈఓ వెంకటరెడ్డి, డీఆర్‌డీఓ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.