అందని బోనస్‌ | - | Sakshi
Sakshi News home page

అందని బోనస్‌

May 13 2025 12:32 AM | Updated on May 13 2025 12:32 AM

అందని

అందని బోనస్‌

15 రోజులు గడిచినా జమ కాని రూ.500 ప్రోత్సాహకం

ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి

మంజూరు కాని నిధులు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా

రూ.11.36 కోట్లు పెండింగ్‌

ఉన్నతాధికారుల మాటలకు

భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు

సన్నరకం వరి రైతులకు

తప్పని ఎదురుచూపులు

అధికారులు కూడా

తెలియదంటున్నారు

50 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రంలో విక్రయించాం. ధాన్యం వేసి 25 రోజులు అవుతుంది. ఇంత వరకు బోనస్‌కు సంబందించి రూ.25 వేలు రావాల్సింది. బోనస్‌ డబ్బులు ఎప్పుడు వేస్తారని అధికారులను సంప్రదిస్తే.. తమకు తెలియదని సమాధానమిచ్చారు. అసలు బోనస్‌ వస్తుందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

– చెన్నప్ప, రైతు, కన్మనూర్‌,

మరికల్‌ మండలం, నారాయణపేట జిల్లా

15 రోజులైనా రాలేదు..

నాకున్న నాలుగు ఎకరాల్లో సన్నరకం వరి సాగు చేశాను. మొత్తం 118 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తే.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మిన. ధాన్యం విక్రయించి ఇప్పటికే 15 రోజులైనా క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ డబ్బులు రాలేదు.

– బూషయ్య, రైతు, లట్టుపల్లి,

బిజినేపల్లి మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లా

ఒకట్రెండు రోజుల్లో

బోనస్‌ డబ్బులు

ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేస్తున్నాం. ఇప్పటి వరకు రైతుల నుంచి 59,785 మెట్రిక్‌ టన్నుల సన్నరకం ధాన్యం కొనుగోలు చేసి సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేయడం జరిగింది. ఒకటి, రెండు రోజుల్లో రూ.8.88 కోట్లు బోనస్‌ డబ్బులు కూడా జమ చేస్తాం. మద్దతు ధరతో ప్రతిఒక్క గింజనూ కొనుగోలు చేస్తాం. రైతులు దళారులను నమ్మి తక్కువ ధరకు ధాన్యాన్ని విక్రయించి నష్టపోవద్దు. డబ్బులు రైతుల ఖాతాల్లోనే జమ చేస్తాం.

– రవినాయక్‌, మేనేజర్‌, జిల్లా

పౌర సరఫరాల సంస్థ, మహబూబ్‌నగర్‌

సాక్షి, నాగర్‌కర్నూల్‌: వరిలో సన్నరకం పండించే రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ అదనంగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించడంతో ఉమ్మడి జిల్లాలో అత్యధిక మంది సన్నాల సాగుకే మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలకు పెద్దఎత్తున సన్నరకం ధాన్యం వస్తోంది. అయితే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించి వారం, పది రోజులు గడుస్తున్నా బోనస్‌ డబ్బులు మాత్రం వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకు 2.28 లక్షల క్వింటాళ్ల సన్నాలు సేకరించగా ఇందుకు సంబంధించి రూ.11.36 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీంతో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా క్వింటాల్‌కు రూ.500 బోనస్‌ డబ్బులు ఎప్పుడు ఖాతాల్లో పడతాయోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

పెరిగిన సన్నాల సాగు..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నరకం వరి సాగు భారీగా పెరిగింది. సాధారణంగా ఇక్కడి రైతులు వానాకాలం సీజన్‌లో సన్నాలు, యాసంగిలో దొడ్డు రకం పండిస్తారు. అయితే ప్రభుత్వం సన్నాలకు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని ప్రకటించడంతో యాసంగి సీజన్‌లోనూ రైతులు సన్నాల సాగుకే మొగ్గు చూపుతున్నారు. నారాయణపేట జిల్లాలో ఇప్పటి వరకు 1.13 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా, ఇందులో ఏకంగా 86,369 మెట్రిక్‌ టన్నులు సన్నాలే కావడం గమనార్హం. మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, జోగుళాంబ గద్వాల జిల్లాల్లోనూ ఇప్పటి వరకు దొడ్డు రకం కంటే.. సన్నాలే ఎక్కువగా కొనుగోలు కేంద్రాలకు వచ్చింది. అయితే కేవలం రెండు రోజుల్లోనే రైతులకు పూర్తిస్థాయిలో ధాన్యం డబ్బులు పడుతాయని అధికారులు చెబుతున్నా ఎక్కడా అమలు కావడం లేదు. కనీస మద్ధతు ధర ప్రకారం ధాన్యం డబ్బులు జమయ్యేందుకు కనీసం వారం రోజులు పడుతుండగా, రూ.500 చొప్పున ప్రభుత్వం ఇచ్చే బోనస్‌ డబ్బులు 15 రోజులు దాటినా పడటం లేదని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బోనస్‌ డబ్బులు ఖాతాల్లో జమచేయాలని వేడుకుంటున్నారు.

జిల్లా కేంద్రాలు సేకరించిన రావాల్సిన

సన్న రకం ధాన్యం బోనస్‌

(క్వింటాళ్లు) (రూ.కోట్లు)

నారాయణపేట 101 86,369 4.31

మహబూబ్‌నగర్‌ 193 59,785 2.98

వనపర్తి 255 53,998 2.69

నాగర్‌కర్నూల్‌ 231 15,321 0.76

జోగుళాంబ గద్వాల 75 12,542 0.62

15 రోజులు గడిచినా..

వాస్తవానికి ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని తేమ శాతం చూశాక నిర్వాహకులు కొనుగోలు చేస్తారు. నిర్ణీత తేమ శాతం వచ్చే వరకు కేంద్రాల్లోనే ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచిస్తున్నారు. ఇందుకు కనీసం వారం రోజుల సమయం పడుతోంది. ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కేవలం రెండు రోజుల్లోనే పూర్తిస్థాయిలో ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలో పడుతాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తోంది. ధాన్యం కొనుగోలు చేసి 15 రోజులైనా బోనస్‌ డబ్బులు మాత్రం పడటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం సన్నరకం ధాన్యానికి బోనస్‌ అమలు చేస్తుందా.. లేదా.. అని అయోమయానికి గురవుతున్నారు.

అందని బోనస్‌ 1
1/4

అందని బోనస్‌

అందని బోనస్‌ 2
2/4

అందని బోనస్‌

అందని బోనస్‌ 3
3/4

అందని బోనస్‌

అందని బోనస్‌ 4
4/4

అందని బోనస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement