
పేర్లు, విగ్రహాలు మారిస్తే తలరాత మారదు
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉద్యమంలోంచి పుట్టిన తెలంగాణ తల్లి ఉండగా మరో తల్లి ఎందుకని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటుచేయడాన్ని నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేర్లు.. విగ్రహాలు మారిస్తే తెలంగాణ ప్రజల తల రాత మారదని అన్నారు. 420 హమీలను పక్కదారి పట్టించేందుకు లేనిపోని వివాదాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆర్థిక సంపద సర్వ నాశనమైందని మండిపడ్డారు. తెలంగాణ సంస్కృతిలో భాగమైన బతుకమ్మను తీసివేసి తెలంగాణ సంస్కృతిని అవమానించారని అన్నారు. ప్రపంచలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిని పూజించే సంప్రదాయం తెలంగాణకు ఉందని, తెలంగాణ తల్లి నుంచి బతుమక్మను తీసివేస్తామంటే తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, ముడా మాజీ చైర్మన్ వెంకన్న, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులు, నాయకులు మల్లుదేవేందర్‌రెడ్డి, గణేష్, శివరాజు, ఆంజనేయులు, పల్లెరవి, అహ్మదోద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి నవకాంత్, రమేష్, సత్యం తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
తెలంగాణ తల్లికి పాలాభిషేకం