
శబ్ధం.. కర్ణ కఠోరం
జడ్చర్ల: ఒకవైపు బైక్ సైలెన్సర్ల మోత.. మరోవైపు డీజే సౌండ్స్ కర్ణ కఠోరంగా మారుతున్నాయి. చెవులకు చిల్లులు పడేలా వినిపిస్తున్న భారీ శబ్ధాలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు అనారోగ్యం భారినపడే పరిస్థితులు నెల కొ న్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ధ్వని కాలు ష్యంతో వాహనదారులు అదిరిపడుతున్నారు. ఇటీ వల యువత తమ బైక్స్ సైలెన్సర్లను మార్చి భారీ శబ్ధం వచ్చేవాటిని అమర్చుకుని నయా ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. అతివేగంగా ప్రయాణిస్తూ దారినపోయేవారికి ఇక్కట్లు తెచ్చిపెడుతున్నారు. మార్కెట్‌లోకి రోజురోజుకు కొత్తగా వస్తున్న బైక్ సైలెన్సర్ల మోతతో ప్రశాంతంగా ఉండే కాలనీలు దడదడ శబ్ధాలతో జళ్లుపడుతున్నాయి. వీటికితోడు విచిత్రమైన హారన్ శబ్ధాలతో చుట్టుపక్కల వారిని హడలెత్తిస్తున్నారు. కొందరు ఆకతాయిలు బస్టాండ్, రద్దీ ప్రదేశాల్లో విన్యాసాలు చేస్తూ తోటివారు పడుతున్న ఇబ్బందులను ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
రాత్రి, పగలు తేడాలేదు
రోడ్డు రవాణా శాఖ వద్ద మోటర్ బైక్‌లను రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం సైలెన్సర్, హారన్‌లను మార్చుకుంటున్నారు. తదుపరి రాత్రి పగలు తేడా లేకుండా మితిమీరిన వేగంతో భారీ శబ్ధాలు చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల జనం శబ్దాల మోతకు జంకుతున్నారు. పసిపిల్లలయితే శబ్దాలకు మరింత భయాలకు లోనై అనారోగ్యం భారిన పడుతున్నారు. ఈ కారణంగా రాత్రి వేళ నిద్రలు పట్టక పోవడంతో వ్యవహారం తలనొప్పిగా మారింది.
మత్తులో మోతమోగిస్తున్నారు
ప్రధానంగా యువత మద్యం, గంజాయి తదితర మత్తు పదార్థాలను సేవించి విచ్చలవిడిగా బైక్‌లు నడుపుతున్నారు. ఆ సమయంలో మితిమీరిన వేగంతోపాటు హారన్‌ల మోతకు తోడు ఒక్కోసారి కేరింతలతో హడలెత్తిస్తున్నారు. ర్యాష్ డ్రైవింగ్‌తో రహదారులపై రాకపోకలు సాగించే వారు వీరి కారణంగా అదిరిపడుతున్నారు.
ఎక్కడపడితే అక్కడ హారన్ల మోత
నిబంధనల మేరకు ఆస్పత్రులు, విద్యాసంస్థలు, ఆలయాలు, కోర్టులు, పోలీస్‌స్టేషన్ తదితర ప్రార్థన స్థలాల వద్ద హారన్ మోగించవద్దు. ఆయా ప్రదేశాల ను సైలెన్స్ జోన్‌గా పరిగణిస్తారు. వాహనాల డ్రైవ ర్లు ఇవేమీ పట్టించుకోకుండా విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ హారన్ల మోత మోగిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర వాహనదారులు చికాకు పడే పరిస్థితి నెలకొనడమేగాక అనారోగ్యంబారిన పడే ప్రమాదముంది.
డీజే సౌండ్‌లతో ఇబ్బందులు
వేడుకల్లో జోష్ కోసం మితిమీరిన శబ్ధాలతో పెడు తున్న డీజేలు మరణ మృదంగాలవుతున్నాయి. ర్యాలీలు తదితర వేడుకలతోపాటు ఫంక్షన్ హాళ్లలో డీజేల మోతతో చెవులు చిల్లులు పడుతున్నాయి. శబ్ధాల హోరులో వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలోని తలుపులు, కిటికీలు గడగడలాడుతున్నాయి. రోడ్లపై నిర్వహించే డీజేలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు.
నిబంధనలు ఇలా..
రాత్రి సమయంలో 10గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు భారీ శబ్ధాలు నిషేధం. ఈ సమయంలో ఎలాంటి ర్యాలీలు తదితర శబ్దాలతో వేడుకలు నిర్వహించకూడదు. 70 డీజేబుల్స్ స్థాయిని మించి శబ్దాలు చేయకూడదన్న నిబంధనలు ఉన్నాయి. కానీ నిబంధనలను బేఖాతరు చేస్తూ భారీ సౌండ్స్ తో ప్రజలను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఎక్కడికక్కడ చర్యలు చేపట్టి ప్రజలకు మేలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
విచ్చలవిడిగా డీజేల వినియోగం
జడ్చర్లలో విచ్చలవిడిగా డీజేలను వినియోగిస్తున్నారు. ర్యాలీలు, వేడుకలల్లో డీజేల సౌండ్‌తో ఉక్కిరిబిక్కరి అవుతున్నాం. బైక్ సైలెన్సర్లు, హారన్ శబ్ధాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు రవాణా శాఖ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవాలి.
– శ్రీనివాసులు, జడ్చర్ల
నరం దెబ్బతింటే వినికిడి లోపం
భారీ శబ్ధాలతో చెవి నరాలు దెబ్బతింటాయి. వినికిడి కోసం మిషన్ వాడాల్సి వస్తుంది. మానవుల చెవులు 25 నుంచి 35 డిజెబుల్స్ వరకు మాత్రమే వినగలుగుతాయి. హారన్స్, సైలెన్సర్ల మోత, డీజే సౌండ్‌లో 50నుంచి 70 డిజెబుల్స్ సామర్థ్యానికి పైగా వస్తుంది.
– కుమార్, ఈఎన్‌టీ, జడ్చర్ల
చర్యలు చేపడుతాం
పట్టణంలో శబ్ధ కాలుష్య నివారణకు చర్యలు తీసుకుంటాం. బైక్ సైలెన్సర్‌లను మార్చి ఇబ్బందులు కలిగించే వారిని గుర్తిస్తాం. అదేవిధంగా నిబంధనలకు విరుద్ధంగా డీజేలు, హారన్‌లను వినియోగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.
– కమలాకర్, సీఐ, జడ్చర్ల
దడ పుట్టిస్తున్న బైక్ సైలెన్సర్లు, హారన్లు
జనం గుండెల్లో డీజే సౌండ్స్ మోత
ఆకతాయిల చేష్టలతో అదిరిపడుతున్న ప్రజానీకం
చోద్యం చూస్తున్న పోలీసులు, అధికారులు