
రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యానికి బీజేపీ కుట్ర
మహబూబ్‌నగర్ న్యూటౌన్: బీహార్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ల తొలగింపును ప్రతిఒక్కరు వ్యతిరేకించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాములు పిలుపునిచ్చారు. గురువారం సీపీఎం కేంద్ర కమిటీ పిలుపుమేరకు బీహార్ రాష్ట్రంలో ఓటరు జాబితా సవరణలో భాగంగా ఓటర్ల తొలగింపును వ్యతిరేకిస్తూ స్థానిక అంబేడ్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యానికి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. బీహార్ రాష్ట్రంలో 65 లక్షల మంది ఓటర్లను తొలగించడం సరికాదన్నారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటూ స్థానికంగా ఉపాధి పొందుతున్న ప్రజలను ఓటర్ల జాబితా నుంచి తొలగించడం సరికాదన్నారు. బీజేపీ ఎన్నికల కమిషన్‌ను అడ్డం పెట్టుకొని తన నియంతృత్వాన్ని కొనసాగిస్తుందని విమర్శించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు కిల్లె గోపాల్ మాట్లాడుతూ ఓటుహక్కు పరిరక్షణ కోసం ప్రజలు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు చంద్రకాంత్, రాజ్‌కుమార్, కడియాల మోహన్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.