
400 ఏళ్ల పండుగ
అచ్చంపేట: రాఖీ పండుగంటే సాధారణంగా అక్కాచెల్లెళ్లు, తమ సోదరులకు రాఖీలు కట్టి వేడుకగా చేసుకుంటారు. అయితే అచ్చంపేటలో పద్మశాలీలు మాత్రం వినూత్నంగా జరుపుకొంటారు. రాఖీ పండుగను నూలు పుట్టిన పండుగగా నిర్వహిస్తారు. ఇది 400 ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ. పురాణాల్లో నూలు గురించి ఉంది. ఈ రోజు నూలు పుట్టిందని, నూలుతో తయారు చేసిన కంకణం కట్టుకొని చేపట్టే ప్రతి కార్యంలో సకల శుభాలు కలుగుతాయని పద్మశాలీల నమ్మకం. మార్కెట్లో ఎన్ని రకాల రాఖీలు వచ్చినా పద్మశాలీలు మాత్రం పత్తి నుంచి తయారు చేసిన నూలు కంకణాన్ని చేతికి కట్టుకోవడం ఆనవాయితీ.
గాయత్రీ మాలధారణ..
పత్తితో తయారు చేసిన ధారంతో కంకణం ధరించడమే కాకుండా.. జంధ్యం (గాయత్రీమాల) కూడా ధరిస్తారు. ముందుగా గాయత్రి హోమం నిర్వహించిన తర్వాత పద్మశాలీలంతా నూలుతో తయారు చేసిన జంద్యాలను 43 ఏళ్లు సామూహికంగా ధరిస్తారు. అనంతరం పూజలు నిర్వహిస్తారు. స్థానిక భక్తమార్కండేయ ఆలయంలో పద్మశాలీ సంఘం ఆధ్వర్యంలో శనివారం 44వ నూలు పూర్ణిమకు ఏర్పాట్లు చేస్తున్నారు.