
కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వం కులగణన జరిపిన తర్వాతే త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సమాజ్ రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కులగణన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని కామారెడ్డి సభలో బీసీ డిక్లరేషన్ ప్రకటించి.. ఇప్పుడు కులగణన ఊసే ఎత్తకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చూడటం అన్యాయమన్నారు. రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఉన్న బీసీలకు సామాజిక న్యాయం చేస్తామని ప్రకటించి, కర్ణాటక ముఖ్యమంత్రి బీసీ సిద్ధరామయ్యతో తెలంగాణ గడ్డమీద ప్రకటన చేయించి తమ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పద్ధతిని అవలంభిస్తూ బీసీలకు అన్యాయం చేయాలని చూస్తే సహించమన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దృష్టిలో సామాజిక న్యాయం అంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన రెడ్లకు పదవులు కాంట్రాక్టులు ఇవ్వడమేనా అని ప్రశ్నించారు. జితేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కూడా లేకుండానే కేబినెట్ హోదా కల్పించడం.. చిన్నారెడ్డి ప్రత్యక్ష ఎన్నికల్లో నేను పోటీ చేయలేనని చేతులెత్తేసినా ఆయనకు పదవి ఇవ్వడం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సీనియర్ బీసీ నాయకులు కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెస్తే వారికి కనీస మర్యాద ఇవ్వకపోవడం కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయమా అని నిలదీశారు. సమావేశంలో బీసీ సమాజ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌సాగర్, పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మీకాంత్, జాండ్ర సంఘం జిల్లా అధ్యక్షుడు మహేందర్, మేదరి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, ఆరెకటిక సంఘం జిల్లా నాయకుడు శ్రీనివాస్, బీసీ సమాజ్ కోకన్వీనర్ సత్యం, బీసీ సమాజ్ దేవరకద్ర నియోజకవర్గ కన్వీనర్ శేఖర్, నాయకులు పాల్గొన్నారు.