
అలసంద పంట సాగు
అలంపూర్: రబీలో సాగు చేసే పంటల్లో అలసంద సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. అలసంద సాగుకు అనువైన నేలల్లో పంట సాగు చేస్తే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుందని వ్యవసాయ శాఖ ఏడీఏ సక్రియా నాయక్ రైతులకు సూచించారు. ఈ పంటను ఫిబ్రవరి నుంచి నెల ఆఖరు వరకు విత్తుకోనే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. తేమను పట్టి ఉంచి మురుగుపోయే చల్కా, ఎర్రనేలల్లో సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ ఏడీఏ రైతులకు వివరిస్తున్నారు. రబీలో ప్రత్యాయ్నా పంటగా అలసంద పంటను సాగు చేసుకుంటే మంచి దిగుబడితోపాటు లాభాలు పొందవచ్చని వివరిస్తున్నారు.
మేలైన యాజమాన్య పద్ధతులు
అలసంద సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని వ్యవసాయ శాఖ అధికారులు వివరిస్తున్నారు. ఎకరాకు 8 నుంచి 10 కిలోల విత్తనం కావాల్సి ఉంటుంది. పశుగ్రాసం లేదా పచ్చిరొట్టగా సాగు చేస్తే ఎకరాకు 12 నుంచి 14 విత్తనం అవసరం ఉంటుంది. కిలో విత్తనానికి 3 గ్రా థైరమ్ చొప్పున కలిపి తప్పనిసరిగా విత్తన శుద్ధి చేయాలి. సాళ్ల మధ్యలో 30 సెం.మీ, మొక్కల మధ్య 10 సెం.మీ ఎడం ఉండేలా విత్తాలి. పంటకు ముందు ఆఖరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల మాగిన పశువుల ఎరువు, 18 కిలోల యూరియా, 100 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసి కలియ దున్నాలి.
కలుపు నివారణ..
పంట విత్తిన వెంటనే లేదా మరుసటి రోజు నేలలో తేమ ఉన్నప్పుడు 200 లీటర్ల నీటిలో 1.5 లీటర్ల పెండిమిథాలిన్ కలిపి ఎకరా విస్తీర్ణంలో పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టి సాళ్ల దంతెతో అంతర కృషి చేయాలి. ఈ పంటకు గొంగళి పురుగు, మారుక మచ్చ పురుల పురుగు, పచ్చదోమ, తెల్లదోమలతో పాటు బూడిద, పల్లాకు, ఆకు మచ్చ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది.
పంట కోత :
పంట 45రోజుల దశలో పచ్చి కాయలు కోతకు వస్తాయి. మూడు రోజులకు ఒకసారి కాయలను కోయవచ్చు. ఎకరాకు 30 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. విత్తనం కోసం పండిస్తే 80 నుంచి 100 రోజులకు కాయలు సిద్ధం అవుతాయి. ఆకులు ఆకుపచ్చని రంగు నుంచి పసుపు రంగులోకి మారి రాలిపోతాయి. ఈ సమయంలో పంట కోత కోయవచ్చు.
విత్తన రకాలు :
జీసీ–3 : పంటకాలం 90–95 రోజులు. దిగుబడి ఎకరానికి 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి ఉంటుంది. స్వల్పకాలికం. గుబురు రకం. పల్లాకు తెగులును తట్టుకుంటుంది. వీ–240 పంట కాలం 90–100 రోజులు. దిగుబడి ఎకరాకు 5–6 క్వింటాళ్లు ఉంటుంది. పశుగ్రాసానికి అనుకూలం. గింజలు ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. సీ–152 రకం పంట కాలం 105 నుంచి 110 రోజులు. దిగుబడి ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల వరకు ఉంటుంది. అంతర పంటగా పండ్ల తోటలకు అనువైన రకం. గింజలు పెద్ద పరిమాణంలో తెలుపు రంగులో ఉంటాయి.
పాడి–పంట
