బరిలో నిలిచేదెందరో? | Sakshi
Sakshi News home page

బరిలో నిలిచేదెందరో?

Published Wed, Nov 15 2023 1:12 AM

- - Sakshi

విత్‌డ్రా చేయించేప్రయత్నాలు...

జెడ్పీసెంటర్‌(మహబూబ్‌నగర్‌): అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎంతమంది బరిలో ఉంటారో బుధవారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత తేలనుంది. ఇప్పటికే నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. షాద్‌నగర్‌ మినహా 13 నియోజకవర్గాల్లో 266మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 43మంది నామినేషన్లను తిరస్కరించగా.. 223మందికి ఆమోదం లభించింది. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం వరకు అవకాశం ఉంది. పోటీ నుంచి తప్పుకోవాలని భావించే వారు మధ్యాహ్నం 3గంటలలోగా విత్‌డ్రా కావాల్సి ఉంటుంది. ఈ సమయం దాటిపోతే పోటీలో ఉన్న అభ్యర్థి కింద అధికారులు పరిగణించి గుర్తు కేటాయిస్తారు. విత్‌డ్రా ప్రక్రియ ముగిసిన వెంటనే బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లతో పాటు వారికి కేటాయించిన గుర్తులను ప్రకటిస్తారు.

4 నామినేషన్ల ఉపసంహరణ..

మహబూబ్‌నగర్‌ సెగ్మెంట్‌లో మంగళవారం స్వతంత్ర అభ్యర్థి శ్రీనివాసులు తన నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నట్లు రిటర్నింగ్‌ అఽధికారి అనిల్‌కుమార్‌ తెలిపారు. ప్రస్తుతం 18మంది ఎన్నికల బరిలో ఉన్నట్లు చెప్పారు. దేవరకద్రలో 14మంది, జడ్చర్లలో 19మంది, నాగర్‌కర్నూల్‌లో 23మంది, అచ్చంపేటలో 17మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొల్లాపూర్‌లో ఇద్దరు నామినేషన్‌లను ఉపసంహరించుకోవడంతో 16మంది బరిలో నిలిచారు. నారాయణపేటలో ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మక్తల్‌లో ఒకరు నామినేషన్‌ విత్‌డ్రా చేసుకోగా, 11మంది ఎన్నికల బరిలో నిలిచారు. వనపర్తిలో 14మంది, గద్వాలలో 20మంది, అలంపూర్‌లో 18మంది, కొడంగల్‌లో 15మంది అభ్యర్థులు ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్నారు.

ఈవీఎంలు ఒకటా.. రెండా..

ధికారుల్లో ఈవీఎంల టెన్షన్‌ పట్టకుంది. ఒక ఈవీఎం బ్యాలెట్‌ పెట్టాల్సి వస్తుందా.. అభ్యర్థులు విత్‌డ్రా చేసుకోకుంటే కచ్చింగా రెండవ ఈవీఎం బ్యాలెట్‌ పెట్టాల్సి వస్తుందన్న ఆందోళనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి బ్యాలెట్‌ యూనిట్లో 16మంది అభ్యర్థుల పేర్లు ఉంటాయి. ఇందులో ఒక నోటా గుర్తు ఉంటుంది. అభ్యర్థుల సంఖ్య పెరిగితే రెండు బ్యాలెట్‌ యూనిట్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల తోపాటు ఇతరాత్ర పార్టీలు, స్వతంత్రులు నామినేషన్లు వేశారు. స్వతంత్రుల వల్ల ప్రధాన పార్టీల అభ్యర్థులపై ప్రభావం పడుతుందనే వాదనలు ఉన్నాయి. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వతంత్రులను బుజ్జగించే పనిలో పడ్డారని తెలుస్తోంది. ఇదే సమయమనుకునే అభ్యర్థులు తమ డిమాండ్లను ప్రధాన పార్టీల అభ్యర్థుల ముదు పెడుతున్నారని సమాచారం.

నేడు మధ్యాహ్నం 3గంటల వరకు విత్‌డ్రాకు అవకాశం

ఆ తర్వాత బరిలో నిలిచే అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

Advertisement
 
Advertisement