ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం! | - | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం!

Oct 21 2023 12:36 AM | Updated on Oct 21 2023 12:26 PM

- - Sakshi

శివకావ్య (ఫైల్‌)

సాక్షి, మహబూబ్‌నగర్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతో పాటు బలవంతంగా మాత్రలు మింగించి కడతేర్చాడో భర్త. ఈ విషాదకర ఘటన ఆత్మకూర్‌లో చోటుచేసుకుంది. ఎస్‌ఐ నరేందర్‌ వివరాల మేరకు.. పట్టణానికి చెందిన శివకావ్య (26) బీటెక్‌ చదువుతున్న సమయంలో స్థానిక బీసీకాలనీకి చెందిన వడ్ల భరత్‌తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఆరేళ్ల కిందట పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు.

వీరికి నాలుగేళ్ల కుమారుడు అన్విధ్‌ ఉన్నాడు. కట్నం కోసం శివకావ్యను వేధించడంతో రెండు పర్యాయాలు తల్లిదండ్రుల నుంచి రూ.లక్షల్లో డబ్బులు తీసుకొచ్చి భర్తకు ఇచ్చింది, అయినప్పటికీ ఇంకా డబ్బులు కావాలని వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో శివకావ్య గర్భం దాల్చింది. డబ్బులు ఇచ్చేంత వరకు పిల్లలను కనేదిలేదని చెబుతూ 45 రోజుల కిందట భార్యతో బలవంతంగా మాత్రలను మింగించాడు.

అవి వికటించడంతో శివకావ్య తీవ్ర అనారోగ్యానికి గురైంది. పలు ప్రవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స చేయించినా కోలుకోకపోవడంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందింది. మృతురాలి తండ్రి ఆరెకటిక కిషన్‌జీ ఫిర్యాదు మేరకు వడ్ల భరత్‌, వేణుగోపాలాచారి, శారద ఇతర కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
చదవండి: ప్రాణాలు తీసిన నిద్రమత్తు.. డ్రైవర్‌తో సహాకూలీల కుటుంబాల్లో తీవ్ర విషాదం!

Advertisement
 
Advertisement
Advertisement