
క్లాక్‌టవర్ వద్ద ముస్లింల భారీ ఊరేగింపు
● భక్తిశ్రద్ధలతో మిలాదున్నబీ వేడుకలు
● జిల్లాకేంద్రంలో ముస్లింల భారీ ఊరేగింపు
● ర్యాలీకి స్వాగతం పలికినమంత్రి శ్రీనివాస్‌గౌడ్
స్టేషన్ మహబూబ్‌నగర్: మహ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్నబీ వేడుకలను గురువారం జిల్లావ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన మసీదుల్లో ముస్లింలు జాగరణలు చేశారు. పవిత్ర ‘ఖురాన్’, హదీస్’ గ్రంథాల్లోని దైవ సందేశాలపై ప్రముఖ ముస్లిం మతపెద్దలు విశ్లేషించి ధర్మప్రబోధాలు చేశారు. మిలాదున్నబీని పురస్కరించుకొని యువజన, ధార్మిక సంఘాల ఆధ్వర్యంలో పలుచోట్ల అన్నదానాలు చేశారు. పేదలకు దుస్తులు, ఆహార పదార్థాలు, రోగులకు పండ్లు, బ్రెడ్ల పంపిణీతోపాటు రక్తదాన శిబిరాలు నిర్వహించారు. అనంతరం పట్టణంలో ముస్లింలు భారీ ఊరేగింపు నిర్వహించారు. ఆయా కాలనీల నుంచి సమూహంగా తరలివచ్చిన ముస్లింలు క్లాక్‌టవర్ నుంచి ఊరేగింపుగా బయలుదేరారు. ‘నారే తక్బీర్ అల్లాహ్ హోఅక్బర్, నారే రిసాలత్ యా రసూలుల్లాహ్’ అంటూ నినాదాలు చేస్తూ అశోక్‌టాకీస్ చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, బస్టాండ్, న్యూటౌన్ చౌరస్తా మీదుగా షాసాబ్‌గుట్ట దర్గా వరకు సాగింది. అనంతరం దర్గా ఆవరణలో షాసాబ్‌గుట్ట పీఠాధిపతి సయ్యద్ అబ్దుల్ రజాక్‌షా ఖాద్రీ అధ్యక్షతన ధార్మిక సభ జరగగా.. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ధార్మిక వేత్త మౌలానా అహ్మద్ నక్షబంది సందేశం ఇచ్చారు.
ప్రవక్త చూపిన మార్గంలో..
అంబేద్కర్ చౌరస్తాలో ఖౌమి ఏక్తా కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద రాష్ట్ర ఎకై ్సజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఊరేగింపునకు స్వాగతం పలికారు. ముస్లిం పెద్దలను మంత్రి సన్మానించి.. ఊరేగింపులో పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఐక్యత, మతసామరస్యం బోధించిన మహ్మద్ ప్రవక్త చూపిన మార్గంలో మనమంతా ముందుకు సాగాలన్నారు. ఊరేగింపు సందర్భంగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర కన్జూమర్ ఫెడరేషన్ చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఎస్పీ నరసింహ, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహెమాన్, ఖౌమీ ఏక్తా కమిటీ ప్రధాన కార్యదర్శి రఫీక్ పటేల్, అఫ్రోజ్‌షా, జాకీర్ అడ్వకేట్, అన్వర్‌పాష, తఖీ హుస్సేన్, అబ్దుల్ హాదీ, ఎంఏ జకీ, మోసీన్‌ఖాన్, షబ్బీర్, జఫర్‌షా, సుల్తాన్ తదితరులు పాల్గొన్నా రు. అలాగే న్యూటౌన్ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌజ్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాగతం పలికి మతపెద్దలను సన్మానించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లురవి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.

ఊరేగింపులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మతపెద్దలు