
అలంపూర్: పురుగు మందులోని విష తీవ్రతలలో తేడాలు ఉన్నప్పటికీ నిస్సందేహంగా అవి విష పదార్థాలని గ్రహించాలి. అవి తయారయ్యే కర్మాగారాలలో, నిల్వ ఉండే గిడ్డంగుల్లో, రైతు పైరుపై చల్లే సమయాల్లో సాధారణంగా పురుగు మందుల వల్ల ప్రమాదాలు కలిగే అవకాశం ఉంటుంది. వీటితో అతి జాగ్రత్తగా వ్యవహరించాలని ఏడీఏ సక్రియనాయక్ రైతులకు సూచిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకున్న కొన్ని సందర్భాల్లో అనుకోని విధంగా పురుగు మందుల విష ప్రభావానికి లోనవుతున్నారు. అందుకు తగ్గ లక్షణాలను గుర్తించి ప్రథమ చికిత్స చేపట్టాలని జాగ్రత్తలు చెబుతున్నారు. పురుగు మందులు మానవ శరీరంలోకి మూడు విధాలుగా చేరడానికి అవకాశం ఉన్నట్లు ఏడీఏ వివరించారు.
చర్మం ద్వారా
శరీరంపై పురుగు మందు పడినప్పుడు చర్మం ద్వారా విషపదార్థం లోపలికి ప్రవేశిస్తుంది. శరీరంపై పుండ్లు, గాయాలు ఉన్నప్పుడు మరింత సులభంగా, త్వరగా ప్రశేశిస్తుంది.
ముక్కు ద్వారా
పురుగు మందు ద్వారా వెలువడే వాయువులు, ధూళి అణువులు గాలిని పీల్చడం వల్ల ముక్కు ద్వారా శరీరంలోకి విష పదార్థం ప్రవేశించి హాని కలిగిస్తుంది.
నోటి ద్వారా
పురుగు మందులను ముట్టుకున్నప్పుడు లేదా వాడిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోకపోవడం వల్ల, పురుగు మందులతో కలుషితమైన ఆహార పానియాలు తీసుకోవడం వల్ల, పురుగు మందుల అవశేషాలు, పరిమితికి మించి ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల తెలిసి, తెలియక పురుగు మందులు నోటి ద్వారా తీసుకోవడం వలన ఆరోగ్యానికి తీవ్ర హాని కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు మరణం సంభవిస్తుంది.
ప్రథమ చికిత్స
చర్మం ద్వారా విష పదార్థం ప్రవేశించినప్పుడు వెంటనే నీటితో సబ్బు ఉపయోగించి కడుక్కోవాలి. కంటిలో పడినప్పుడు శుభ్రమైన నీటిని అధికంగా ఉపయోగించి కడుక్కోవాలి. చికిత్స కోసం వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. బట్టలపై పడినప్పుడు వెంటనే తీసివేయాలి. వాటిని ఉతికి శుభ్రం చేసిన తర్వాతే ధరించాలి.
● ముక్కుతో పీల్చినప్పుడు విష పదార్థం శరీరంలోకి ప్రవేశించినప్పుడు, విష ప్రభావానికి లోనైన వ్యక్తిని వెంటనే కలుషిత వాతవరణం నుంచి దూరం తీసుకెళ్లాలి. ధారాళంగా గాలి వచ్చే వాతవరణంలోకి మార్చాలి. దుస్తులు శరీరానికి అంటి పెట్టుకుని ఉన్నట్లయితే వదులు చేయాలి. శ్వాస తీసుకోవడం కష్టంగా ఉన్నా లేక పూర్తిగా ఆగిపోయిన వెంటనే కృత్రిమ శ్వాస కల్పించాలి. ఆరోగ్యమైన వ్యక్తి ఎవరైనా తన నోటి ద్వారా అతని నోటిలోని గాలిని ఊది సులభంగాను, శక్తి వంతంగాను ఊపిరిపోయొచ్చు. విష ప్రభావానికి లోనైన వ్యక్తిని వీలైనంత త్వరగా చికిత్స కోసం వైద్యుని వద్దకు తీసుకెళ్లాలి.
● నోటి ద్వారా విష పదార్థం తీసుకున్నప్పుడు వెంటనే వాంతి చేయించాలి. గ్లాసు వేడి నీళ్లలో స్పూన్ ఉప్పు లేక ఆవాల పొడి కలిపి తాగించాలి. గొంతులో వేళ్లు పెట్టి కక్కించాలి. కడుపులోని పదార్థం ఖాళీ అయ్యేటట్లు చూడాలి. 8 గ్రాముల చార్‌కోల్, 4 గ్రాముల ట్యానిక్ యాసిడ్, 4 గ్రాముల మెగ్నీషియం ఆకై ్సడ్ రసాయనాలను అర గ్లాసు వేడి నీళ్లలో కలిపి తాగించాలి. పాలు, గుడ్డులోని తెల్లసోన, జలటీన్, లేపనం, ఇస్తే జీర్ణాశయం, లోపలి భాగానికి హాని కలగదు. వెంటనే వైద్యున్ని సంప్రదిస్తే జీర్ణాశయం, చిన్న ప్రేగులు వీలైనంత శుభ్రం అయ్యేలా చేస్తారు. అనంతరం చికిత్స అందిస్తారు. .
పాడి–పంట
