
శిల్పారామంలో మహిళలకు 10 స్టాళ్లు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: జిల్లాకేంద్రంలోని శిల్పారామంలో ఉన్న 42 స్టాళ్ల (షాపులు)లో పది మహిళ (ఎస్‌హెచ్‌జీ)లకు కేటాయిస్తామని స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ శివేంద్రప్రతాప్ అన్నారు. మంగళవారం రాత్రి మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ సమావేశ మందిరంలో వీధి వ్యాపారులు, మహిళా సంఘాల సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శిల్పారామంలోని స్టాళ్లు, ఫంక్షన్ హాలు, ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను అద్దెకు ఇవ్వడానికి నిర్ణయించామన్నారు. త్వరలో టెండర్లు నిర్వహించనున్నామని ఔత్సాహికులు పాల్గొనవచ్చన్నారు. కాగా, ఏ షాపు ఎంత విస్తీర్ణం ఉందో కొలతలు చేసి ఎంత అద్దె ఉండాలో నిర్ణయించాలని ఆర్‌ఓ మహమ్మద్ ఖాజాను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.ప్రవీణ్‌కుమార్ రెడ్డి, మెప్మా ఇన్‌చార్జ్ డీఎంసీ ఎం.లక్ష్మి, ఆర్‌ఐలు టి.నర్సింహ, అహ్మద్‌షరీఫ్ పాల్గొన్నారు.