
రైతుల మేలుకే కాళేశ్వరం ప్రాజెక్టు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తమ హయాంలో రైతులకు మేలు చేసేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించినట్లు మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మంగళవారం బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి మహబూబ్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో చూశారు. అనంతరం విలేకరులతో వారు మాట్లాడుతూ 2007 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ్మిడిహట్టి వద్ద దమ్మిడి పని కూడా ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. తాము అధికారంలోని వచ్చాక రెండేళ్లలోనే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు నిర్మించామన్నారు. దీనికి 19 సబ్‌స్టేషన్లు, 203 కి.మీ. సొరంగం, 1534 కి.మీ. గ్రావిటీ, 240 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టుతో 20,33,572 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరంలో రెండు పిల్లర్లతోనే ఇబ్బంది ఉందని, కేవలం రెండు నెలల్లోనే వాటికి మరమ్మతు చేసి నీళ్లు ఇవ్వవచ్చన్నారు. ఈ ప్రాజెక్టు కొట్టుకుపోతే బాగుండు.. అని కాంగ్రెస్ నాయకులు ఎదురు చూసిండ్రని విమర్శించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికి జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఇవ్వకుండానే ఎలా బయటకు వచ్చిందన్నారు. ప్రస్తుతం పండిన పంటలకు కనీస ధర దక్కడం లేదని, రైతులకు అలుగుపిండి, యూరియా పిండి దొరకడం లేదని, కరెంట్ కూడా ఉండటం లేదన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో రైతులకు సకాలంలో అన్నీ అందేలా చేశామన్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధిపరిచామన్నారు. సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు వాల్యానాయక్, రాజేశ్వర్‌గౌడ్, యాద య్య, నర్సింహులు, ఆంజనేయులు, రహమాన్, శివరాజ్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి