
మహబూబ్‌నగర్: లక్ష రూపాయలకు ఆశపడి మోసానికి గురై ఉరేసుకొని మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన శనివారం హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ ఏరియాలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసుల కథనం ప్రకారం.. సల్కర్‌పేట్‌కు చెందిన బాబమ్మ(33) నాలుగేళ్ల క్రితం ఎదిరకు చెందిన రమేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. బతుకుదెరువు కోసం ఇద్దరు హైదరాబాద్ వెళ్లి ఎల్‌బీ నగర్ ఏరియాలోని గుడ్డి జంగయ్య కాలనీలో నివాసం ఉంటున్నారు.
రమేష్ లేబర్ పనిచేస్తుండగా బాబమ్మ కళాజాత బృందం కార్యక్రమాలకు వెళ్తుండేది. ఇటీవల బాబమ్మ ఫేస్‌బుక్‌లో ధని యాప్ ఫైనాన్స్ అని వచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే రూ.4500 కడితే లక్ష రూపాయలు లోన్ వస్తుందని, 24 నెలల పాటు రూ.4,230 చొప్పున కట్టాలని ఉంది. దీంతో ఆమె యాప్‌లోని నంబర్‌కు ఫోన్ చేసి వారితో మాట్లాడింది. తనకు లోన్ కావాలని చెప్పడంతో రూ.4500 అకౌంట్‌లో వేయాలని వారు నంబరు ఇచ్చారు.
బాబమ్మ ముందు రూ.3వేలు వేసి, మరుసటి రోజు రూ.1500 అకౌంట్‌లో వేసింది. వెంటనే లక్ష రూపాయలు ఆమె భర్త రమేష్ అకౌంట్‌లో జమ చేసినట్లు ఆమె ఫోన్ వారు వాట్సప్‌కు పెట్టారు. తర్వాత చెక్కుబుక్ కోసం రూ.10వేలు వేయాలని చెప్పడంతో మళ్లీ వేసింది. ఇలా గత శుక్రవారం నుంచి సోమవారం వరకు రూ.80 వేలు వేసింది. మంగళవారం నుంచి సంబంధిత యాప్ సిబ్బంది స్పందించలేదు. రమేష్ ఏటీఎంకు వెళ్లి కార్డుతో చెక్ చేసుకుంటే తన అకౌంట్‌లో రూ.7 మాత్రమే ఉన్నాయి.
గురువారం బాబమ్మ జడ్చర్ల కళాజాత ప్రోగ్రాంకు వెళ్లి వచ్చి శుక్రవారం మధ్యాహ్నం ఎల్‌బీనగర్ గుడ్డి జంగయ్య కాలనీలోని ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆమె స్వగ్రామమైన సల్కర్‌పేట్‌కు మృతదేహం తీసుకొచ్చి శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. ఏడాది వారికి బాబు పుట్టి చనిపోయాడు. ధని యాప్ వారి మోసం వల్ల తన భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త వాపోయాడు.