
తాళ్లచెరువు కట్ట కిందిభాగంలో సమాధులపై మట్టి పోసి నిర్మించిన రహదారి
‘మా నాన్న, అమ్మ చనిపోయి 18 సంవత్సరాలు కావొస్తోంది. వీరు చనిపోయిన మూడు, నాలుగేళ్లకే మా తమ్ముడు, మరదలు చనిపోయారు.
వీరందరి సమాధులు తాళ్లచెరువు కట్టపైనే పెట్టాం. ప్రతి ఏటా పెద్దలకు పెట్టుకునేటప్పుడు, పండగ పూట కుటుంబసభ్యులమందరం సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించుకునే వాళ్లం. ప్రస్తుతం అవకాశం లేకుండా పోయింది. అసలు ఆనవాళ్లే లేకుండా చేశారు. ప్రజాప్రతినిధులను అడిగితే న్యాయం చేస్తామన్నారు. ఇప్పటివరకు ఎవరూ పట్టించుకోలేదు.
అభివృద్ధి చేస్తే కాదనేది లేదు. కానీ.. మా నమ్మకాన్ని వమ్ము చేయడం, మనోభావాలు దెబ్బతీయడం కరెక్ట్ కాదు కదా..’ అని వనపర్తిలోని మారెమ్మకుంట చెందిన ఎ.రంగన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఇతని ఒక్కని పరిస్థితే కాదు.. తమ పూర్వీకుల ఆనవాళ్లను చెరిపేశారని వందలాది కుటుంబీకులు మదనపడుతున్నారు.
మంత్రి ఇలాకా ‘వనపర్తి’లోఘనకార్యం
● రోడ్డు విస్తరణ పేరిట ‘గుర్తులు’ చెరిపేసి..
● బీసీ, ఎస్సీలమనోభావాలతో ఆటలు
● తాళ్లచెరువు కట్ట ఆధునికీకరణలోఒంటెద్దు పోకడలు
● బడుగు, బలహీన
వర్గాల నుంచి
విమర్శల వెల్లువ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: కాలం చేసిన వారి జ్ఞాపకార్థం సమాధులు నిర్మిస్తారు. పూర్వీకులను స్మరించుకుంటూ ప్రతి ఏటా పెద్దల పండగ చేసుకుంటారు. సమాధులకు పుష్పాలంకరణతో పాటు వారికి ఇష్టమైన నూతన వస్త్రాలు పెట్టి, పిండి పదార్థాలు, ఇతర వంటకాలు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. మరణించిన వారు తమతోనే ఉంటారు.. వారి ఆశీస్సులు ఉండాలి.. వంశాన్ని కాపాడతారు అనేది ఆయా కుటుంబీకుల భావన. ఈ సంప్రదాయం అనేది తాతలు, ముత్తాతల కాలం.. అంతకు ముందు నుంచే ఆనవాయితీగా వస్తోంది. అయితే నమ్మకం అనే పునాదిపై ఏర్పడిన సమాధులు, వాటి జ్ఞాపకాలను చెరిపేసి.. ప్రజల మనోభావాలతో ఆటలాడుకుంటున్నారు. అడిగేవారు లేరనే ధీమాతో అనేక ఏళ్లుగా ఉన్న సమాధులపైనే రోడ్డు వేశారు. ఇది ఎక్కడో కాదు.. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి నియోజకవర్గంలోనే జరిగింది. అభివృద్ధి, ఆధునికీకరణ పేరిట చోటుచేసుకున్న ఈ ఘనకార్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

