దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

May 19 2026 1:34 AM | Updated on May 19 2026 1:34 AM

తొర్రూరు: ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని తొర్రూరు ఆర్డీఓ జి.గణేష్‌ అన్నారు. డివిజన్‌ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి, స్థానికుల నుంచి 13 దరఖాస్తులు అందాయి. తొర్రూరు, పెద్దవంగర, నెల్లికుదురు, మరిపెడ, నర్సింహులపేట, దంతాలపల్లి, చిన్నగూడూరు మండలాలకు సంబంధించిన వారు ఫిర్యాదులు అందించారు. ఆర్డీఓ మాట్లాడుతూ.. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతీ వినతిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో డీఎల్‌పీఓ పుల్లారావు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌రెడ్డి, ఏఎల్‌ఓ రవి, ఆర్డీఓ కార్యాలయ ఏఓ అనిల్‌కుమార్‌, ఎకై ్సజ్‌ ఎస్సై శంకర్‌, ఏడీఏ విజయ్‌చంద్ర, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయలక్ష్మీ, ఏఓ రాంనర్సయ్య, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదులు ఇలా...

మున్సిపల్‌ కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలి..

తొర్రూరు పట్టణంలోని అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన మంగళపల్లి ప్రసాద్‌ మున్సిపాలిటీలో గత కొంత కాలంగా తాత్కాలిక కార్మికుడిగా పని చేస్తున్నాడు. 2015 ఆగస్టు నుంచితనను విధుల్లోకి రాకుండా కమిషనర్‌ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, రెండు మాసాల వేతనాలు సైతం నిలిపివేశాడని ఆవేదన వ్యక్తం చేశాడు. కుటుంబ తగాదాలను ఆసరా చేసుకుని తనను విధుల్లో చేరకుండా అడ్డుకుంటున్న కమిషనర్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు.

డబుల్‌బెడ్రూం ఇల్లు ఆక్రమించారు..

పెద్దవంగర మండలం రాజమాన్‌సింగ్‌ తండా పంచాయతీ పరిధిలోని దేవుని బావితండాకు చెందిన గుగులోతు అస్లీకి 2018లో డబుల్‌ బెడ్రూం ఇల్లు ప్రభుత్వం కేటాయించింది. కాగా, పనులు కొన్ని పూర్తి చేయాల్సి ఉండగా దానిలోకి లబ్ధిదారు వెళ్లలేదు. దీంతో అదే తండాకు మరో వ్యక్తి సదరు ఇల్లును ఆక్రమించి అనధికారికంగా నివాసముంటున్నాడు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని లబ్ధిదారు కుమారుడు దినేష్‌ ఆర్డీఓకు ఫిర్యాదు చేశాడు.

వినతులు వెంటనే పరిష్కరించాలి

మహబూబాబాద్‌: ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని ఆర్డీఓ కృష్ణవేణి అన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా ఆర్డీఓ ప్రతీ దరఖాస్తును స్వయంగా తీసుకుని సంబంధిత అధికారులతో మాట్లాడారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సమస్యలు సత్వర పరిష్కారం కోసమే ప్రభుత్వం ప్రజావాణి నిర్వహిస్తుందన్నారు. పెండింగ్‌ వినతులను కూడా వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణిలో 8 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో కేసముద్రం మున్సిపాలిటీ పరిధి అమీనాపురం గ్రామంలోని హన్మంతరావుగర్‌ కాలనీలో పది గుంటల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని, దానిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని నాయకులు వినతి అందజేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి మర్రిపెల్లి మొగిలి, కుమారస్వామి తదితరులు ఉన్నారు.

తొర్రూరు ఆర్డీఓ గణేష్‌

ప్రజావాణిలో 13 అర్జీల స్వీకరణ

Advertisement
 
Advertisement
Advertisement