● 2 వేల ఏళ్ల క్రితం నాటి బౌద్ధ
యక్షిణి శిల్పంగా గుర్తింపు
కమలాపూర్: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని శనిగరంలో శాతవాహనుల కాలం నాటి టెర్రకోట శిల్పం తల లభ్యమైంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఉజ్జేతుల రాజు ఇచ్చిన సమాచారం మేరకు శనిగరం గ్రామ శివారులోని వాగు పరీవాహక ప్రాంతంలో చెక్‌డ్యాం పక్కన గట్టుమల్లు అనే రైతుకు చెందిన పంట పొలాల్లో శాతవాహనుల కాలం నాటి టెర్రకోట శిల్పం తల (సుమారు 2 వేల ఏళ్ల క్రితం నాటి బౌద్ధ యక్షిణి శిల్పం)ను గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర పరిశోధక బృందం సభ్యుడు దేవరం రమేష్ శర్మ తెలిపారు. ఈ శిల్పం కోటిలింగాల, ధూళికట్ట, చేర్యాల కొండపాకలో లభించిన టెర్రకోట శిల్పాలను పోలి ఉందని, ఇదొక యక్షిణి టెర్రకోట శిల్పమని, నుదుట బొట్టు, రెండు పాయలుగా కట్టిన సిగ, ఆభరణాలతో ఉన్న ఈ శిల్పం తల ఎత్తు 5 సెంటీమీటర్లు, వెడల్పు 3 సెంటీమీటర్లు ఉందని, తల వెనుక భాగం మట్టి పొరలు రాలిపోయి ఉందని వివరించారు. చక్కని పని తనంతో కూడిన ఈ టెర్రకోట శిల్పం శాతవాహనుల కాలం నాటి సాంస్కృతిక చిహ్నమని, తొలి చారిత్రక యుగానికి చెందిన ఈ అపురూప టెర్రకోట శిల్పం చారిత్రకంగా విశేషమైందని తెలిపారు. ఈ శిల్పం దొరికిన పంట పొలాల్లో మట్టి పూసలు, కుండ పెంకులు, టెర్రకోట శిల్పాల అవశేషాలు లభిస్తున్నాయని స్థానిక రైతులు చెబుతున్నారని, పురావస్తు శాఖ ఇక్కడ మరిన్ని పరిశోధనలు చేస్తే మరిన్ని ఆనవాళ్లు దొరికే అవకాశం ఉంటుందని రమేష్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు.


