కాశిబుగ్గ: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను అమలు చేయడంతో పూర్తిగా విఫలమైందని, తెలంగాణకు చెందిన డబ్బులను ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తరలిస్తున్నారని మాజీ మంత్రి, ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. వరంగల్ ఓ సిటీలోని ఎర్రబెల్లి ప్రదీప్‌రావు క్యాంపు కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి పాలన సాగిస్తుందన్నారు. తెలంగాణకు సంబంధించిన నిధులను ఎన్నికలు జరుగే పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు పంపిస్తున్నారని ఆరోపించారు. రైతులకు రైతు బంధు ఎకరానికి రూ.12 వేలు ఇస్తామని చెప్పి, ఒక ఎకరానికే పరిమితమయ్యారన్నారు. మహిళలకు ఇస్తామన్న రూ.2,500, పెన్షన్ పెంపు అడ్రస్ లేకుండా పోయిందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజల సమస్యలను పరిష్కరించకుండా, వ్యక్తిగత చర్చలకే పరిమితం చేశారని ఆరోపించారు. అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు మాట్లాడుతూ.. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పేరుతో నిధుల దుర్వినియోగం జరుగుతుందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్, మాజీ మేయర్ తక్కెళ్లపల్లి రాజేశ్వర్‌రావు, వన్నాల శ్రీరాములు, బొడిగె శోభ, ఎడ్ల అశోక్‌రెడ్డి, వంగాల సమ్మిరెడ్డి, డాక్టర్ కాళీప్రసాద్, రత్నం సతీష్‌షా, రంజిత్, తిరుపతిరెడ్డి, వెంకట్‌గౌడ్ పాల్గొన్నారు.
తెలంగాణ డబ్బులు
ఎన్నికల రాష్ట్రాలకు తరలింపు
మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్


