● మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్
కాజీపేట రూరల్: కాజీపేటను రైల్వే డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, పోరాడి సాధించుకున్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని, చిరువ్యాపారులకు సముదాయాలు కట్టించాలని బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్ దాస్యం వినయ్‌భాస్కర్ అన్నారు. కాజీపేట మీడియా పాయింట్‌లో ఆయన శనివారం మాట్లాడుతూ అనేక అంశాలపై రైల్వే జీఎంను మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, కాజీపేట బీఆర్‌ఎస్ నాయకులతో కలిసి గత మార్చి 9వ తేదీన కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు గుర్తుచేశారు. కోచ్‌ఫ్యాక్టరీ నిర్మాణంలో ఇళ్లు, భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. కాజీపేట డివిజన్ ఏర్పాటు, కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వకుంటే ప్రధాని ప్రారంభోత్సవాన్ని అడ్డుకుంటామని వినయ్‌భాస్కర్ హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు వేణు, నార్లగిరి రమేష్, కుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు.


