లీటర్ ఆయిల్ ధరలు(రూ.లలో) ఇలా..
నూనె నెల క్రితం ప్రస్తుతం
సన్ ఫ్లవర్ 150 175–180
వేరుశనగ 155 180–185
పామాయిల్ 130 150–155
తొర్రూరు: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నిత్యావసర సరుకుల ధరలు మండుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర పెరిగి అందుబాటులో లేకుండా పోగా.. తాజాగా వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వంట నూనె సలసల కాగుతోంది. యుద్ధం సాకుగా చూపి కొందరు వ్యాపారులు వంట నూనెల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. దీంతో వాటి ధరలు అమాంతం పెంచేశారు. నెల రోజుల వ్యవధిలోనే ఏకంగా కిలో ధర 22 శాతం పెరిగింది. గత నెల 10న పొద్దుతిరుగుడు వంట నూనె లీటర్ ప్యాకెట్ రూ.140 నుంచి రూ.145 ఉండేది. 15 కిలోల డబ్బా రూ.2,200 వరకు విక్రయించేవారు. యుద్ధం ప్రారంభమైన రెండో వారం నుంచి లీటర్ ప్యాకెట్ ధర రూ.180కు చేరింది. 15 కిలోల డబ్బా రూ.2,700 నుంచి రూ.2,00కు పెరిగింది. పామాయిల్ లీటర్ ప్యాకెట్ రూ.130 నుంచి రూ.155కు ఎగబాకింది. జిల్లాలో రోజు ఆరు వేల లీటర్ల వంట నూనె అమ్మకాలు జరగుతాయి. పెంచి అమ్ముతున్న ధరల వల్ల వినియోగదారులపై రోజుకు రూ.70 వేలు అదనంగా భారం పడుతోంది. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో మరో రూ.2అదనంగా వసూలు చేస్తున్నారు. చౌక దుకాణాల ద్వారా గతంలో రాయితీపై పామాయిల్ అందించేవారు. ప్రభుత్వం నూనె అందించకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
యథేచ్ఛగా కల్తీ...
ధరలు పెరగడంతో కల్తీ పెత్తనం చేస్తోంది. హోటళ్లు, బజ్జీ కొట్ల వారు తక్కువ ధరకు దొరికే కల్తీ నూనెను కొనుగోలు చేస్తున్నారు. పామాయిల్ నూనెను హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, బజ్జీ కొట్ల నిర్వాహకులతో పాటు పేద, మధ్య తరగతి కుటుంబాలు ఎక్కువగా వాడతాయి.
మొక్కుబడిగా నియంత్రణ కమిటీలు..
నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, అధిక ధరలకు అమ్మినా మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఉన్న నియంత్రణ కమిటీలు తనిఖీలు చేయాల్సి ఉంటుంది. అవన్నీ మొక్కుబడిగా మారాయి. అధికారులు వీటిపై దృష్టి సారించడం లేదు. హోల్‌సేల్ వ్యాపారాలు, పెద్ద దుకాణాలను తనిఖీ చేస్తే ఎక్కువ ధరలకు అమ్మకుండా నియంత్రణలో ఉంటారు. ఇతర వస్తువులపై ప్రభావం పడకముందే యంత్రాంగం చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
కిలోకు రూ.20 నుంచి రూ.30వరకు పెరుగుదల
సామాన్యులపై అదనపు భారం
మార్కెట్‌లో యథేచ్ఛగా కల్తీ నూనెలు
పట్టింపులేని అధికారులు
నూనె కొనడం భారంగా మారింది
నెల రోజుల్లో రూ.20 నుంచి రూ.30 వరకు నూనె ధరలు పెరగడంతో కొనడం కష్టంగా ఉంది. ఇలా ధరలు పెరిగితే మాలాంటి పేదలు ఎలా కొనుగోలు చేస్తారు? ప్రభుత్వం ఆలోచన చేసి ధరలు తగ్గించాలి.
–బాద నాగమణి, గృహిణి
ధరలు నియంత్రించాలి
వంట నూనెల ధరలు తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. నియంత్రించే యంత్రాంగం ఉన్నా వ్యాపారులు ఇష్టారీతిన పెంచుతున్నారు. వంట నూనెల ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చూడాలి.
–మధుకర్‌రావు, వెలికట్ట


