అవ్వ మద్దతే కీలకం
సాక్షి, మహబూబాబాద్: మూలన ఉన్న ముసలమ్మను కూడా తక్కువ అంచనా వేయొద్దు అంటారు పెద్దలు. మున్సిపల్ వార్డు అభ్యర్థులు కొద్ది ఓట్ల తేడాతోనే గెలవడం లేదా ఓడిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతీ ఓటు కీలకమే. ఇందులో ప్రధానంగా వృద్ధులతో పాటు వితంతు, దివ్యాంగుల ఓట్లు గెలుపోటములను శాసించనున్నాయి. కాగా, ఆసరా పింఛన్‌దారుల మద్దతు ఎవరికి ఉంటుందనే చర్చ జరుగుతోంది. అయితే అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ నాయకులు మాత్రం పింఛన్‌దారుల మద్దతు మాకే ఉంటుందంటే.. మాకే ఉంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
వారు కీలకం..
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటముల్లో ఆసరా పింఛన్‌దారులు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది. జిల్లాలోని మహబూబాబాద్, తొర్రూరు, మరిపెడ, డోర్నకల్, కేసముద్రం మున్సిపాలిటీల్లో వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, గీత కార్మికులు, డయాలసిస్, ఒంటరి మహిళలు ఇలా అన్ని రకాల ఆసరా పింఛన్‌దారులు 14,992 మంది ఉన్నారు. వీరిలో ఒకటి, రెండు శాతం మినహా మిగిలిన వారందరూ ఓటు హక్కు కలిగి ఉన్నారు. వీరితోపాటు కుటుంబ సభ్యులను కలుపుకుంటే ఐదు మున్సిపాలిటీల్లో 30వేలకు పైగా మంది ఉండే అవకాశం ఉంది. కావునా వార్డు సభ్యుల గెలుపులో వీరి ఓటు కీలకంగా ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
పింఛన్‌దారుల ఓట్లు మాకే పడతాయంటే.. మాకే వేస్తారనే ధీమాను అన్ని రాజకీయ పార్టీల నాయకులు వ్యక్తం చేస్తున్నారు. అర్హులందరికీ పింఛన్ సౌకర్యం కల్పించింది కాంగ్రెస్ పార్టీ.. త్వరలో పింఛన్ రెట్టింపు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. అందుకోసమే శాసనసభ, పార్లమెంట్‌తోపాటు, ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వారి మద్దతు మాకే ఉంది. ప్రస్తుతం కూడా మాకే ఓటేస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతే పింఛన్ పెంచామని, పింఛన్‌దారుల మద్దతు బీఆర్‌ఎస్ అభ్యర్థులకే ఉంటుందని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. అయితే వార్డుల్లో పింఛన్ ఇప్పించింది మేం.. వారి కష్ట సుఖాల్లో అండగా ఉంటున్నామని, అందుకోసం మాకే మద్దతు ఉంటుందని ఇతర పార్టీల అభ్యర్థులు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మున్సిపాలిటీ వృద్ధులు దివ్యాంగులు వితంతువులు ఒంటరి మహిళలు ఇతరులు మొత్తం
మహబూబాబాద్ 2,860 1,147 3,427 234 138 7,806
డోర్నకల్ 286 201 710 50 06 1,253
కేసముద్రం 806 342 1103 87 27 2,365
మరిపెడ 620 264 810 71 42 1,807
తొర్రూరు 545 250 819 97 50 1,761
మొత్తం 5,117 2,204 6,869 539 263 14,992
వృద్ధులు, దివ్యాంగుల ఓట్లపై దృష్టి
ఐదు మున్సిపాలిటీల్లో సుమారు 15వేల మంది ఆసరా పింఛన్‌దారులు
అభ్యర్థుల గెలుపోటముల్లో కీలక భూమిక
ఓట్ల వేటలో అధికార, ప్రతిపక్ష పార్టీలు
ఎవరి ధీమా వారిదే..
అవ్వ మద్దతే కీలకం
అవ్వ మద్దతే కీలకం


