పులి.. ఒకటా? రెండా? | - | Sakshi
Sakshi News home page

పులి.. ఒకటా? రెండా?

Feb 7 2026 2:04 PM | Updated on Feb 7 2026 2:04 PM

పులి.

పులి.. ఒకటా? రెండా?

పులి.. ఒకటా? రెండా?

జనగామ జిల్లాలో పశువులపై సాగిస్తున్న వేట

పులికోసం బోన్లు.. ట్రాప్‌ కెమెరాల ఏర్పాటు

పగలు కొండల్లో.. రాత్రి పొలాల్లో టైగర్‌ జాడలు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు

జనగామ: మూడు రోజులుగా జనగామ జిల్లా బచ్చన్నపేట, జనగామ, లింగాలఘణపురం, రఘునాథపల్లి మండలాల పరిసర అటవీ ప్రాంతాల్లో పులి సంచారం వార్తలు గ్రామాలను వణికిస్తున్నాయి. మొదట అటవీ ప్రాంతాల్లోనే తిరుగుతున్నట్లు భావించినా ఇప్పుడు మనుషుల నివాస ప్రాంతాలవైపు వచ్చిందన్న ప్రచారంతో అధికార యంత్రాంగం ప్రజలను మరింత అప్రమత్తం చేస్తోంది. రఘునాథపల్లి, బచ్చన్నపేట మండలాల్లోని చెరువుల అంచులు, పల్లె వెలుపల ఉన్న పొలాల్లో పులి పాదముద్రలు కనిపించడంతో గ్రామస్తులు రాత్రివేళలో బయటకు రావడానికి, వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వెళ్లడానికి జంకుతున్నారు. పశువులను కూడా వెలుపల వదలడానికి భయపడుతున్నారు. పగలు కొండకోనల్లో తిష్ట వేసిన పులి ఇప్పటివరకు రాత్రివేళల్లో యాదాద్రి, జనగామ జిల్లాలో 20 వరకు ఆవులు, మేకలను వేటాడినట్టు పలు గ్రామాల్లో వార్తలు, సంఘటనలు వెలుగులోకి రావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

ఆడనా.. మగనా...

ఈ పులి ఎక్కడినుంచి వచ్చింది.. మగపులా? ఆడపులా? లేక రెండు పులులా? అన్న అనుమానాలు కొనసాగుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచరించిన పులిని అటవీశాఖ అధికారులు రాయల్‌ బెంగాల్‌ టైగర్‌గా గుర్తించారు. ఇది మగ పులిగా నిర్ధారించారు. కానీ, బచ్చన్నపేట మండలంలో మరో పులి సంచరిస్తోందనే ప్రచారం ప్రజల్లో మరింత భయాన్ని రేకెత్తిస్తోంది. ఒకే సమయంలో రెండు ప్రాంతాల్లో పులిఛాయలు, పాదముద్రలు భిన్నంగా ఉండడం వంటి అంశాలు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయని ప్రజ లు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో అటవీ శాఖ, పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించాయి. పులి కదలికలను గుర్తించేందుకు అటవీ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, ట్రాపింగ్‌ బోన్లు ఏర్పాటు చేశారు. గ్రామాల్లో రాత్రి పహారా బృందాలను ఏర్పాటు చేసి గ్రామస్తులను అప్రమత్తం చేస్తున్నారు.

ప్రజల అప్రమత్తతకు.. సూచనలు

● పులి సంచారంపై జిల్లా అటవీశాఖ అధికారులు ప్రజలకు ముందస్తు జాగ్రత్తలు చెబుతున్నారు.

● పులి కదలికలు రాత్రివేళల్లో చురుకుగా ఉంటాయని, వేకువజామున, సాయంత్రం, చీకటి పడిన తర్వాత పులి సంచరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు ఇళ్లలోనే ఉండడం మంచిది.

● పులి కనిపించిన సందర్భంలో పెద్దగా గోల చేయరాదు. శబ్దాల వల్ల పులి మరింత ఆందోళనకు గురవుతుంది.

● మేకలు, ఆవులు వంటి పశువులను రాత్రివేళల్లో బయట ఉంచవద్దు.

● రాత్రి పొలాలకు వెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు, మహిళలు రాత్రివేళల్లో ఒంటరిగా బయటికి వెళ్లొద్దు.

● వీలైనంత వరకు గుంపులుగా ప్రయాణించాలి.

● పులి కదలికలు కనిపిస్తే వెంటనే ఎస్‌ఎస్‌ఓ, ఎఫ్‌ఆర్‌ఓ, ఎస్‌హెచ్‌ఓ, తహసీల్దార్‌లకు సమాచారం ఇవ్వాలి.

పులి.. ఒకటా? రెండా?1
1/1

పులి.. ఒకటా? రెండా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement