ఏజెన్సీలో ‘యాప్’సోపాలు
బయ్యారం: యూరియా బుకింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఫర్టిలైజర్ యాప్‌తో ఏజెన్సీ మండలాల్లోని రైతులకు కష్టాలు మొదలయ్యాయి. యాసంగిలో సాగు చేసిన పంటలకు భూమి పట్టాలు లేని రైతులు ఇప్పటి వరకు ఒక్క బస్తా యూరియా తీసుకోని పరిస్థితి ఉంది. పాసుపుస్తకాలు ఉన్న రైతులకు మాత్రమే ఆన్‌లైన్‌లో యూరియా బుకింగ్ చేసుకొనే అవకాశం ఉండడంతో.. పట్టాలు లేని రైతులు తమకు యూరియా ఎవరిస్తారని వ్యవసాయ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. మరో వైపు షాపులకు యూరియా స్టాక్ కేటాయించిన నిమిషా ల్లోనే బుకింగ్ ప్రక్రియ పూర్తి కావడంతో ఏజెన్సీ మండలాల రైతులు సెల్ సిగ్నల్స్ సమస్యతో యూరియా బుక్ చేసుకోలేకపోతున్నారు.
ఏజెన్సీ మండలాల్లో సిగ్నల్స్ సమస్య..
జిల్లాలోని బయ్యారం, గార్ల, గూడూరు, కొత్తగూడ, గంగారం మండలాలు ఏజెన్సీ పరిధిలో ఉన్నాయి. ఈ మండలాల్లో ఎక్కువ సంఖ్యలో గిరిజన, గిరిజనేతర రైతులు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌లో ఆయా మండలాల్లో సుమారు 62వేల ఎకరాల్లో మొక్కజొన్న, వరి పంటలు సాగు చేశారు. ఇందులో మొక్కజొన్న పంటను అధికంగా సాగు చేశారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన యాప్ ద్వారా రైతులు యూరియా బుకింగ్ చేసుకుంటున్నారు. అయితే ఏజెన్సీలో సెల్‌ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో రైతులు సకాలంలో బుకింగ్ చేసుకోలేకపోతున్నారు.
వారు ఏఈఓల ద్వారా
బుక్ చేసుకోవచ్చు
పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులు తమ క్లస్టర్ ఏఈఓలను ఆధార్‌కార్డుతో పాటు ఆధార్‌కు అనుసంధానమైన ఫోన్ నంబర్‌తో సంప్రదించాలి. రైతుల వివరాలను ఏఈఓలు అప్‌లోడ్ చేస్తే ఆతర్వాత సంబంధిత రైతులు యూరియాను బుక్ చేసుకొనే వెసులుబాటు ఉంది. ఏజెన్సీ గ్రామాల్లో సెల్‌సిగ్నల్స్ లేక సకాలంలో యూరియాను బుక్ చేసుకోలేకపోతున్నామని పలువురు రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు.
–రాజు, ఏఓ, బయ్యారం
పలు మండలాల్లో అందుబాటులో లేని సెల్‌ఫోన్‌సిగ్నల్స్
ఫర్టిలైజర్ యాప్‌లో యూరియా బుకింగ్ కోసం రైతుల పాట్లు
పట్టాదారు పాసుపుస్తకాలు లేనివారికి అందని బస్తాలు
అన్నదాతలకు తప్పని కష్టాలు


