కాంగ్రెస్ ఆచి..తూచి..
మానుకోటలో తేలని పొత్తులు
డోర్నకల్, మరిపెడలో రెబల్స్..
సాక్షి, మహబూబాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల నుంచి పోటీచేసే అభ్యర్థుల ప్రకటన కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఒకొక్కటి ఒక్కొక్క తీరుగా ఉండటంతో జిల్లా పార్టీ నాయకులు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇందులో ఒకవైపు వామపక్షపార్టీలతో తేలని పొత్తులు.. మరోవైపు రెబల్ అభ్యర్థుల బెడద, మరోవైపు ప్రధాన నాయకులు అనుచరుల కోసం ప్రయత్నాలు వీటన్నింటితో నాయకులకు తలనొప్పిగా మారింది.
మానుకోటలో గందరగోళం
మహబూబాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ వామపక్షాలు సీపీఎం, సీపీఐతో పొత్తులు ఉంటాయని ఇరుపార్టీల నాయకులు చెప్పుకొచ్చారు. ఇందులో సీపీఎం నాలుగు స్థానాలతో తృప్తి పడి ఆయా చోట్ల నామినేషన్ వేయగా.. సీపీఐ మాత్రం తమకు 12 నుంచి 15 వార్డులు ఇవ్వాలని అడిగారు. నామినేషన్ల స్వీకరణ చివరి రోజు వరకు పొత్తు తేలకపోవడంతో సీపీఐ 13 స్థానాల్లో నామినేషన్లు వేసింది. అదే వార్డుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కూడా నామినేషన్ వేసి తమకే టికెట్ వస్తుందని ధీమాతో ఉన్నారు. దీంతో మొత్తం 36 వార్డులకు గాను కేవలం 14 వార్డుల్లోనే కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.
కేసముద్రం, తొర్రూరులో కొలిక్కి..
మొదటి నుంచి ఇబ్బందులు లేకుండా ఉన్న కేసముద్రం మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను శుక్రవారం డీసీసీ అధ్యక్షురాలు భూక్య ఉమ ప్రకటించారు. రెబల్ అభ్యర్థుల బెడద ఎక్కువగా ఉన్న తొర్రూరులో ఎట్టకేలకు రెండు వర్గాల మధ్య సమన్వయం కుదిరింది. ఇందుకోసం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్యవర్తిగా వ్యవహరించి ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో అంతా మౌనంగా ఉండిపోయారు.
కేసముద్రం, తొర్రూరులో
అభ్యర్థుల ప్రకటన
రెండు మున్సిపాలిటీల్లో రెబల్స్ బెడద
డోర్నకల్ నియోజకవర్గంలోని డోర్నకల్, మరిపెడ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రతీ వార్డులో పోటీ పడ్డారు. కొన్నిచోట్ల ఒక్క పార్టీ నుంచే ఐదారుగురు నామినేషన్లు వేశారు. అందరినీ సమన్వయం చేసే పనిలో ఎమ్మెల్యే రాంచంద్రునాయక్ ఉండగా.. ఎవరికి బీ–ఫామ్ వస్తుందో అనే ఉత్కంఠలో నామినేషన్లు వేసిన వారు ఉన్నారు. ఎమ్మెల్యే మాట విని ఎంత మంది తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారో.. ఎంత మంది రెబల్స్‌గా బరిలో ఉంటారో అనేది చర్చగా మారింది.


