ప్రతీ జాతరకు ఎడ్లబండిలోనే..
● అనాదిగా ఆచారాన్ని పాటిస్తున్న భక్తులు ● ఇంటి నుంచే వంటసామగ్రి ● మూడురోజుల విడిది ● బండిలో వస్తేనే అచ్చాయమంటున్న భక్తులుమేడారం(ఏటూరునాగారం): మేడారం సమ్మక్క –సారలమ్మల దర్శనానికి వచ్చే భక్తులు అనేక రకాల వాహనాల్లో వస్తుంటారు. అయితే పలువురు ఏళ్లతరబడి ఎడ్లబండ్ల ప్రయాణంతోనే తల్లుల చెంతకు చేరుకుని దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది. రెండు రోజుల ముందే ఎడ్లబండిలో ఇళ్ల నుంచి బయల్దేరి మంగళవారం రాత్రి, బుధవారం వేకువజామున చేరుకొని విడిది చేశారు. ఎడ్లబండిలో వచ్చి మొక్కులు చెల్లిస్తేనే వారికి అచ్చాయం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
ఇంటి నుంచే వంట సామగ్రి
మా తాత కాలం నుంచి ఎడ్లబండిలోనే మేడారం వచ్చి తల్లులకు మొక్కులు చెల్లించుకుంటాం. ఇప్పటికీ అదే పద్ధతిలో జాతరకు వస్తున్నాం. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న వంట సామగ్రితో రెండు రోజుల పాటు జంపన్నవాగు సమీపంలో గడిపి అమ్మవారికి మొక్కులు చెల్లించాం.
– అన్నవరం కృష్ణవేణి, తరిగొప్పుల
ఎడ్లబండిలో వస్తేనే అచ్చాయం..
ఎడ్లబండిలో వస్తేనే తల్లుల అచ్చాయం లభిస్తుందని మా నమ్మకం. అత్తగారు, అమ్మవాళ్లతో కలిసి ఎడ్లబండిలో వచ్చాం. ఇక్కడ రెండు రోజులు గడిపి వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించాం. ఎత్తు బంగారం(బెల్లం), యాటపోతు బలిచ్చి తల్లుల దీవెనలను పొంది తిరుగు ప్రయాణం చేస్తాం.
– మేడి వర్షిణి, పరకాల


